calender_icon.png 24 November, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ టార్గెట్ కాంగ్రెస్ విముక్త భారత్

24-11-2025 01:08:14 AM

2018లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన

-ఏడేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బలు

-2014లో దేశంలో 21 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం 

-ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాలకు పరిమితం 

-అంటే.. దేశ జనాభాలో 10% మందికే కాంగ్రెస్ పాలన 

-బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం 

-ఫలిస్తున్న ప్రధాని మోదీ నాయకత్వం, అమిత్‌షా వ్యూహాలు 

-ఆత్మవిమర్శ చేసుకుకపోతే ఇక ‘హస్త’గత సమాప్తమే!

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో 2018 జూలై7న  కేంద్ర మంత్రి అమిత్ షా ఇచ్చిన ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదం నేడు అక్షర సత్యమవుతున్నదని అప్పటినుంచి బీజేపీ సాధిస్తున్న విజయాలను చూస్తే తెలిసిపోతుంది. భారతదేశాన్ని దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ పదేళ్ల నుంచి దారుణమైన వైఫల్యాలను ఎదుర్కొంటున్నది. పార్టీకి కంచుకోట లుగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికార పగ్గాలను స్వయం కృతాపరాధాలతో వదులుకుని బంగా రు పళ్లెంలో బీజేపీకి అప్పగించింది.

2014లో దేశంలో 21 రాష్ట్రాల్లో అధికారం ఉన్న పార్టీ ఇప్పుడు కేవలం తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌కే పరిమితమైంది. అంటే.. దేశ జనాభాలో కేవలం సుమారు 10శాతం మందిని మాత్రమే పాలించే స్థాయికి దిగజారింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘భారత్ జోడో యాత్ర’, ‘ఓట్ చోరీ’ అంటూ ఎన్ని ఎత్తులువేసినా అవి చిత్తుగానే మిగిలిపోయాయి. అందుకు తాజా సాక్ష్యమే బీహార్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మొత్తం 243 స్థానాలకు గాను, ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది.

బీజేపీ తిరుగులేని విజయాల వెనుక 2014 నుంచి ప్రధాని మోదీ నాయకత్వం, అమిత్ షా వ్యూహాలదే ముఖ్యభూమిక. గతేడాది అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఉత్తర భారతంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు దోహదపడింది. తద్వారా కాంగ్రెస్‌ను నామమాత్రపు పార్టీగా కుదించడంలో బీజేపీ సఫలీకృతమైంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే దేశం త్వరలో ‘కాంగ్రెస్ విముక్త భారత్’ అవుతుందనే సంకేతాలు వెలువడుతున్నట్లు కనిపిస్తున్నది.

‘హస్తం’ చేతిలో మూడు రాష్ట్రాలే 

కేంద్ర మంత్రి అమిత్ షా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ ప్రకటన కేవలం ఆ ఎన్నికల్లో గెలుపు కోసమే కాదని, దశాబ్దా లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ను అధోగతిపాలు చేయడం కోసమేనని ఆ తర్వాతి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ప్రధాని మోదీ నాయకత్వం, కేంద్రమంత్రి అమిత్ షా వ్యూహాలు కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా బలహీనపరుస్తూ వచ్చాయి. ఫలితంగా 2025 నవంబర్ నాటికి కాంగ్రెస్ కేవలం తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. 2014లో 20కి పైగా రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేతిబట్టిన కాంగ్రెస్, ప్రస్తుతం దేశ జనాభాలో కేవలం 10 శాతం జనాభాను పాలించే స్థాయికి దిగజారింది. 

తగ్గుతున్న కాంగ్రెస్ ప్రాభవం 

2014 సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రలోనే కనిష్ఠ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కేవలం 44 స్థానాలకు పరిమితమైంది. ఆ ఎన్నికల్లో పార్టీ కేవలం 19.3 శాతం ఓట్లను మాత్రమే సాధించగలిగింది. ఇదే సమయంలో బీజేపీ మాత్రం 282 సీట్లతో 1984 తర్వాత మొదటిసారి ఒంటరిగానే మెజార్టీ సాధించి అధికారాన్ని చేపట్టింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అంతకముందుకంటే కేవలం 52 సీట్లకు పెంచుకోగలిగింది.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుని ఒంటరిగా 99 సీట్లు సాధించగలిగింది. ఇండియా కూటమి మొత్తంగా 234 సీట్లు మాత్రమే సాధించింది. 2014 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 18 రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి కాంగ్రెస్‌కు బలమని భావించే రాష్ట్రాలూ బీజేపీ చేతిలో వెళ్లిపోయాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 సీట్లలో బీజేపీ 163 సీట్లు గెలిచింది. ఆ రాష్ట్రంలో 70 శాతం ఓటింగ్ జరగగా, 38 శాతం ఓట్లను బీజేపీనే రాబట్టింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓటు శాతం 15 లోపే.

ఫలించిన ఆపరేషన్ ఆకర్ష్ 

కేంద్ర మంత్రి అమిత్ షా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదం కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలోకి కూడా వచ్చింది. 2017లో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ప్రభావంతో ఇతర పార్టీలకు చెందిన 25 మందికిపైగా నేతలు బీజేపీలో చేరారు. ఈ దెబ్బతో వారిలో చాలామందిపై ఉన్న అవినీతి కేసులు సమసి పోయాయన్న చర్చ నాడు జరిగింది. 2022 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.

మొత్తం 403 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 255 సీట్లు సాధించింది. సమాజ్‌వాదీపార్టీ, కాంగ్రెస్ కూటమి కేవలం 111 సీట్లకే పరిమితమైంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనతో దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి రేషన్ అందింది. నీతి ఆయోగ్ నివేదక ప్రకారం 2014 నుంచి ఇప్పటివరకు 25 కోట్ల కుటుంబాలు పేదరికం నుంచి బయట పడగలిగారని స్పష్టమైంది.

కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకు బీజేపీ మతపరమైన భావోద్వేగాలనూ సమర్థవంతంగా ఉపయోగించుకున్నది. 2024లో అయోధ్యలో రామ మందిరం ప్రారంభించడం ద్వారా ఉత్తర భారతంలో బీజేపీకి తిరగులేని మద్దతు లభించినట్లయింది. ఉత్తర భారతానికి గుండెకాయ లాంటి ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఒక ఉప ఎన్నికల్లో బీజేపీకి 15 శాతం వరకు ఓటు శాతం పెరడం సానుకూల పవనాలకు సంకేతంగా నిలిచింది. 2022 రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భారీగా జనాల దృష్టిని ఆకర్షించినప్పటికీ, అది ఎన్నికల ఫలితాలపై ఏమాత్రం ప్రభావం చూపించలేదు.

‘ఓట్‌చోరీ’ అస్త్రం విఫలం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఎన్డీయే కూటమి ఏకంగా 202 స్థానాలను దక్కించుకున్నది. కాంగ్రెస్ కూటమి కేవలం 34 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 61 స్థాన్లాల్లో బరిలో నిలిచి, కేవలం 6 స్థానాలను మాత్రమే దక్కించుకున్నారు. అంటే గెలుపు శాతం 10 కంటే తక్కువే.

2010 తర్వాత కాంగ్రెస్‌కు ఇదే అత్యంత ఘోర పరాభవం. వామపక్షాల కంటే తక్కువ ఓటు శాతం నమోదు చేయడం గమనార్మం. స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (సర్) పేరిట ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియలో ‘ఓట్ చోరీ’ జరిగిందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ గగ్గోలు పెట్టారు. పెద్ద పెద్ద మీడియా సమావేశాలు పెట్టిమరీ మొత్తుకున్నారు. కానీ, ఆ ఆరోపణలు బీహార్ ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదనేది ఎన్డీయే కూటమి అఖండ విజయంతో తేలిపోయింది.

ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు రాహుల్ గాంధీ భారత్‌లో ఉండ కుండా గల్ఫ్ దేశానికి వెళ్లిపోవడం, కూటమి నేత తేజస్వీ యాదవ్‌ను ఒక్కడినే మీడియా ముందుకు వదిలేయడం తీవ్ర విమర్శలకు తావివచ్చింది. పార్లమెంట్‌లో రాహుల్ వ్యవహారశైలిపైనా ఆ పార్టీ ఎంపీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాన్ బ్రిట్టాస్‌తోపాటు పలువురు నేతలు రాహుల్ గాంధీ కారణంగా సభా చర్చలు దెబ్బ తింటున్నాయని అసంతృప్తికి గురవుతున్నారు. పార్టీలో కొత్త నేతలకు అవకాశం ఇవ్వడం లేదనే విమర్శలను రాహుల్ మూటగట్టుకుంటున్నారు. 

వ్యవస్థాపక వైఫల్యమే..

కాంగ్రెస్ పార్టీకి కేవలం దురదృష్టం ఎదురై ఓటమిపాలు కాలేదు. పార్టీ వ్యవస్థాపక వైఫల్యాల కారణంగానే విఫలమవుతున్నది. అధిష్ఠాన పెద్దలు ఢిల్లీకే పరిమితమై క్షేత్రస్థాయిలో పరిస్థితులను పట్టించుకోకపోవడం పార్టీని మరింత బలహీన పరుస్తుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ పెద్దలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ చేతుల్లో యంత్రాంగమంతా పాతబడి పోయిందనే వాదనలూ వినిపిస్తున్నాయి. దీనికితోడు ఆశ్రిత పక్షపాతం, సొమ్ము ముట్టజెప్తేనే టికెట్ల కేటాయింపు వంటి అంశాలు పారీట ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి. తాజాగా బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిశీలకులు టికెట్లు అమ్మకానికి  పెట్టారనే విమర్శలు గుప్పుమన్నాయి.

గుజరాత్‌కు చెందిన విజయ్ శర్మ అనే కాంగ్రెస్ నేత ప్రీపోల్స్ ముందు రాష్ట్రనేతలు హైకమాండ్‌ను తప్పుదోవ పట్టించారని విమర్శించాడు. బీహార్‌లో ఆర్జేడీతో సీట్ల పంపకాల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పూర్తిగా తగ్గారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 2014 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19.5 శాతం ఓట్లు సాధించగా, ప్రస్తుతం ఆ శాతం 19.1కి తగ్గింది. తాజాగా బీజేపీ 37 శాతం ఓట్లను సాధించింది. 

ఆత్మవిమర్శ అవసరం

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అత్మవిమర్శ ఎంతో అవసరం. ‘ఓటు చోరీ’ అనే రాజకీయ ప్రసంగాలకు బదులు ఆ పార్టీ అగ్రనేతలు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, నిత్యావసరాల ధరల తగ్గింపు, రైతు సమస్యలకు పరిష్కారం వంటి ప్రజా ఉద్యమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగశాతం 8.1 ఉంది. నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రతి కుటుంబంపై 6 శాతం అదనపు ఆర్థిక భారం పడుతున్నది.

ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు మద్దతు ధర లభించక, అరొకర చేతికొచ్చిన సొమ్ముతో అప్పులు తీర్చలేక, దళారుల చేతిలో మోసపోయి, వడ్డీ వ్యాపారులకు మిత్తి చెల్లించలేక, పిల్లలను చదివించలేక, కుటుంబాలను పోషించలేక 2014 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

వ్యవసాయిక దేశమైన భారత్‌లో రైతు ఉద్యమాలకు దన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా పార్టీలో వర్గపోరును పరిష్కరించుకుని, కోటరీ పాలన విధానాలకు స్వస్తిపలికి ప్రజల మధ్యకు రావాల్సిన అవసరం ఉంది. ఇటీవల బీహార్ ఎన్నికల్లో ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ వైఫల్యాన్ని రాజకీయ విశ్లేషకులు ఎత్తిచూపుతున్నారు.

ఏప్రిల్‌లో జరిగిన ఏఐసీసీ కీలక సమావేశాల్లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేర్కొనట్టుగా పార్టీలో జిల్లా స్థాయి నాయకత్వానికి ఎక్కువ అధికారాలు ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో మొదలైంది. గుజరాత్‌లో విఫలనేత ముమ్తాజ్ పటేల్ వంటి వారిని వెంటనే మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ కూడా ఢిల్లీకే పరిమితం కాకుండా, ప్రజల మధ్యకు రావాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కు ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి.

జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి నుంచి జేఎంఎం తప్పుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ), సీబీఐ, ఐటీ కేసుల ఒత్తిడికి మున్ముందు పార్టీలో మరిన్ని పరిణామాలు రావొచ్చని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పెద్దల మేల్కొని, అవసరమైన సంస్కరణలు చేపట్టకపోతే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించినట్లు ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నిజమయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.

మిగిలిన రాష్ట్రాల్లోనూ కూలేందుకు సిద్ధంగా

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ పార్టీ ప్రమాదపుటంచున ఉందనే చెప్పాలి. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ కోటకు బీటలు వారే పరిస్థితులున్నాయి. కర్ణాటకలో సీఎం సిద్ధారామయ్య ప్రభుత్వానికి మహర్షి వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం ఉచ్చులా బిగుసుకుంటున్నది.

ఈ కుంభకోణంలో రూ.16 వేల కోట్ల మేర అవినీతి జరిగిందని బీజేపీ విరుచుకుపడుతున్నది. ఈ పరిణామాలన్నీ 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో సీఎం సుఖ్‌విందర్‌సింగ్ సుఖు ప్రభుత్వం రూ.10 వేల కోట్లకుపైగా ఆర్థిక లోటుతో సతమతమవుతున్నది.

అలాగే తెలంగాణలోని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతుల అసంతృప్తుల మధ్య నలిగిపోతున్నది. ఈ క్రమంలో బీజేపీ దూకుడు మరింతగా పెంచింది. 2014తో పోలిస్తే మూడు రాష్ట్రాలకు చెందిన నేతలపై ఇప్పుడు ఈడీ దాడులు 300 శాతం పెరిగాయి. దాడులు ఇలాగే కొనసాగితే 2028 నాటికి ఈ మూడు రాష్ట్రాల్లో కనీసం రెండు ప్రభుత్వాలు కూలిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇక కాంగ్రెస్ చేతిలో ఇక మిగిలేది కేవలం ఒక రాష్ట్రం మాత్రమే.