24-11-2025 12:31:00 AM
-భారీగా తరలివచ్చిన అడవి బిడ్డలు
-జనసంద్రంగా మారిన ఉట్నూర్
-ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలంటూ తుడం మోగించిన ఆదివాసీలు
-ఇది ఆరంభం మాత్రమేనన్న వక్తలు
ఆదిలాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఏకైక డిమాండ్‌తో ఆదివాసీలు చేపట్టిన ధర్మ యుద్ధం దద్దరిల్లింది. ఆదివారం ఉట్నూరు మండల కేంద్రంలో తుడుం దెబ్బ, వివిధ ఆదివాసీ సంఘాలు, ఆదివాసీల తెగల నేతృత్వంలో భారీగా నిర్వహించిన ధర్మ యుద్ధం బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుండి వేలాదిగా ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఉట్నూర్ రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. ఎటువైపు నుంచి చూసినా ఆకు పచ్చని జెండాలను చేత పట్టుకొని, తుడుం మోగిస్తూ వేలాదిగా ఆదివాసీలు సభా ప్రాంగణానికి వచ్చారు.
కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, జీసీసీ చైర్మన్ తిరుపతి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మహారాష్ట్ర ఆదివాసీ నేతలు తిరుమల్ మహా బావుజీ, సువర్ణ వేర్కడే, ధర్మ యుద్ధ సభ సమన్వయ కర్త మెస్రం దుర్గు, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కోట్నాక్ విజయ్, మైపతి అరుణ్ కుమార్, నగేష్, గోడం గణేశ్ తో పాటు పలువురు మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నేతలు, ఆదివాసీ 9 తెగల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ముందుగా స్థానిక కేబీ కాంప్లెక్స్‌లోని కొమురం భీం విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం తుడుం మోగిస్తూ ఇతర సాంప్రదాయ వాయిద్యాలతో సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదివాసీ మేధావులు ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.
1981లో భూమి, భుక్తి, విముక్తి కోసం ఇంద్రవెల్లిలో సభ జరిగితే నేడు ఉట్నూర్ కేంద్రంగా చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితాలో తొలగించాలని ఆదివాసీ ధర్మయుద్ధ సభ నిర్వహించుకుంటున్నామన్నారు. రాంజీగోండు, కొమురం భీం, సూరు, ఇతర ఆదివాసీ పోరాట యోధులను గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో లంబాడీలు ఇతర కులాల్లో కొనసాగుతున్నారని, తెలంగాణలో మాత్రం ఎస్టీలలో కొనసాగుతున్నారన్నారు.
ఆదివాసీలకు చెందాల్సిన హక్కులు, రిజర్వేషన్లు హరించుకోవడంతో ఆదివాసీలు మరింత వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కుల కోసం పిడికిలి బిగించాల్సిన అవసరం ఉందన్నారు. పోరాటాల ద్వారా హక్కులు సాధించుకోవాలన్నారు. ఉట్నూర్ సభ ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆదివాసీల అస్థిత్వన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. అంతరిస్తున్న జాతులను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
సమాజం కోసం పోరాటాలు చేయాల్సిందే : ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆదివాసీ నవ సమాజం కోసం ప్రజలతో పాటుగా పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయాల్సిందేనని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. సమస్యలపై అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని, ఇప్పటికీ అన్నింటిలో నష్టపోయామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే లంబాడీలను ఎస్టీలో చేర్చారని, ఇప్పుడు అదే ప్రభు త్వం అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు.
ఆదివాసీ సమాజమే ముఖ్యం: ఎమ్మెల్యే బొజ్జు పటేల్
తనకు ఆదివాసీ సమాజమే ముఖ్యమని ఆ తర్వాతే మరేమైనా అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పట్టేల్ అన్నారు. ఆదివాసీ సమాజంలోని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీ పెద్దలను, మేధావులను, నాయకులను సీఎం వద్దకు తీసుకేల్తామని తెలిపారు. ఆదివాసీల సమస్యలపై గల్లీ నుంచి ఢీల్లీ వరకు గత 35 ఏళ్ల నుంచి పోరాటాలు జరగుతునే ఉన్నాయన్నారు. చట్టాల అమలు ఎవరి పరిధిలో ఉందోనని అందరూ వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. జాతీకి ఎవరూ అన్యాయం చేయొద్దని సూచించారు.
భారీ పోలీస్ బందోబస్తు
ఆదివాసీల ధర్మ యుద్ధం సభ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పా టు చేశారు. అదనపు డీజీపీ మహేష్ భగవత్, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహజాన్ నేతృత్వంలో ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, వందలాది మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పా టు చేశారు. ఉదయం నుంచి మంచిర్యాల్, కరీంనగర్ జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను, ప్రైవేటు వాహనాలను గుడిహత్నూర్ ఎక్స్ రోడ్డు వద్దనే నిలిపివేస్తూ నిర్మల్ మీదుగా దారి మళ్లించారు.