calender_icon.png 24 November, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనుషుల్లోనే దేవుడు..సత్యసాయి

24-11-2025 12:59:55 AM

ప్రేమతో ఏదైనా సాధించొచ్చని నిరూపించారు

-పాలమూరు దాహార్తిని తీర్చిన మహనీయుడు

-ఆయన ఆలోచనలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి

-ఏపీ, తెలంగాణతో సహా తమిళనాడులోనూ సేవలు

-తెలంగాణలోనూ బాబా జయంత్యుత్సవాలు నిర్వహిస్తాం

-పుట్టపర్తిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి) : సత్యసాయి మనుషుల్లో దేవు డిగా శాశ్వత స్థానం ఏర్పరచుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారని.. ఆయన ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సత్యసాయి ట్రస్ట్ చేసిందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో  నిర్వహించిన సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ఉపరాష్ర్టపతి రాధాకృష్ణన్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ  విద్యాశాఖ మంత్రి లోకేష్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, తమిళనాడు మంత్రి శేఖరార్‌బాబు , ఛత్తీస్‌గఢ్, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులు హాజరయ్యారు.

అంతకు ముం దు స్వర్ణ రథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ  కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్య అందించారని, లక్షలాది మందికి వైద్య సదుపాయం కల్పించారని తెలిపారు.

సత్యసాయి మానవ సేవే మాధవ సేవ అని బోధించడమే కాకుండా అమలు చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన ధైర్యాన్ని వారు అందించారని, 140 దేశాల్లో సత్యసాయిబాబాకు భక్తులున్నారని తెలిపారు. వారు ప్రపంచవ్యాప్తంగా సేవలంది స్తున్నారని,  సత్యసాయి సేవలను సీఎం కొనియాడారు. సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనడం అరుదైన అవకాశంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

విద్య, వైద్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించి చూపించారని కొనియాడారు. ఉమ్మడి మ హబూబ్‌నగర్  వంటి వలస జిల్లాకు తాగునీటి సదుపాయం కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాతో పాటు తమిళనాడులోనూ తాగునీటి సమస్యను పరిష్కరించారని తెలిపారు. తెలంగాణలో కూడా సత్యసాయి జయంతి ఉత్సవాలు అ ధికారికంగా నిర్వహిస్తామని సీఎం తెలిపారు. 

లక్ష్యం కోసం సత్యసాయి అవతరించారు : ఏపీ సీఎం

పుణ్యభూమి పుట్టపర్తిలో ఒక లక్ష్యం కోసం సత్యసాయి అవతరించారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సత్యసాయి ఒక ఉద్దేశంతో లోకానికి వచ్చి దాని కోసమే జీవించారని, మన కోసం సాయి సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్లారని తెలిపారు. సత్యసాయిబాబా తన బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారని, క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించే సత్యసాయిబాబా చెప్పేవారని గుర్తుచేశారు.

సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింసా సిద్ధాంతాలుగా నూతన అధ్యాయం ప్రారంభించారని, మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమన్నారు. సకల జను ల సంక్షేమాన్ని కోరుకున్నారని, వివిధ దేశాల అధినేతలు వచ్చి ఆయన్ను దర్శించుకున్నారని, భగవాన్ సాయి సిద్దంతాం ప్రపంచమంతా వ్యాపించిందన్నారు.

కులం, మతం ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థసేవలకు సత్యసాయి బాబా నిలువెత్తు రూపమని చంద్రబాబు నాయుడు కొనియాడారు. 102 సత్యసాయిబాబా పాఠశా లల్లో 60 వేల మంది చదువుతున్నారని, ట్రస్టు ఆసుపత్రుల ద్వారా రోజుకు 3 వేల మందికిపైగా రోగులకు చికిత్స అందుతోందని తెలిపారు. ఈ ఉత్సవాలను ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.