15-10-2025 01:30:08 AM
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిల్లో కొంత మొత్తాన్ని వెంటనే విడుదల చేస్తామని.. పాఠశాలల వారీగా ఉన్న బకాయిల వివరాలను వెంటనే పంపాలని జిల్లా కలెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. విద్యా, వైద్య రంగాలపై జిల్లా కలెక్టర్లు సీరియస్‌గా దృష్టి సారించాలని, పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే ఆర్థిక శాఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మం త్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను డిప్యూ టీ సీఎం నిర్వహించారు. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద నిధులకు సంబంధించిన ఒప్పందం పాఠశాల యాజమాన్యాలు, జిల్లా యం త్రాంగం మధ్యన జరిగిందని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే పాఠశాల యాజమాన్యాలు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలి.. తప్ప విద్యార్థులను బయటికి పంపడానికి వీలులేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, సంక్షేమ శాఖల అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండేలా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యా హక్కు చట్టం, బెస్ట్ అవైలబుల్ స్కీం ఏం చెబుతుంది, పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వ యంత్రాంగం మధ్య జరిగిన ఒప్పందంలో ఏఏ అంశాలు ఉన్నాయో పాఠశాలల యాజమాన్యాలను పిలిచి వివరించాలని ఆదేశించారు.
ఆ.. స్కూళ్లపై నివేదిక ఇవ్వాలి
బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులు ఎప్పటికప్పుడు రాకపోతే కొన్ని పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఉందని భట్టి విక్రమార్కకు అధికారులు వివరించారు. అయితే, కేవలం బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులపై ఆధారపడితే అది ప్రముఖ పాఠశాల ఏ విధంగా అవుతుందని జిల్లా కలెక్టర్లను డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. డీఈవోలు వెంట నే అన్ని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌ను సందర్శించాలని ఆదేశించారు.
ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది? ప్రభుత్వ నిబంధనలు సరిగా పాటిస్తున్నారా? లేదా? ఆయా పాఠశాలల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వెంటనే నివేదిక సమర్పించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. గడి చిన ఏడు సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల వివరాలు సేకరించాలని సూచించారు. ప్రస్తుతం ఆ విద్యార్థులంతా ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఉన్నత విద్యకు వెళ్లారా?లేదా? తదితర వివరాలు సేకరించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లు, అధికా రులు స్వయం గా పర్యవేక్షించి బెస్ట్ అవైలబుల్ స్కీం కొనసాగుతున్న పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను కోరారు. సమావేశంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా, సాంఘిక సంక్షేమ శాఖ సెక్రెటరీ బుద్ధ ప్రకాశ్, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ క్షితిజ తదితరులు పాల్గొన్నారు.