calender_icon.png 29 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమాలుగా నేను చిన్నప్పుడు విన్న కథలు

29-09-2025 12:36:33 AM

జూనియర్ ఎన్టీఆర్

 ‘నేను చిన్నప్పుడు విన్న కథలతో సినిమా రూపొందుతుందని ఎప్పుడూ అనుకోలేదని, అలా తెరకెక్కిన ‘కాంతారా’ సినిమా విజయం అందుకోవడం ఆనందాన్నిచ్చిందని నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ కూడా సూపర్‌హిట్ అవుతుందని జోస్యంచెప్పారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఆదివారం నిర్వహించిన చిత్రం ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసిమ మాట్లాడారు.

‘దాదాపు నాకు మూడేళ్ల వయసు న్నప్పుడు.. అమ్మమ్మ కుందాపుర సమీపంలోనే మన ఊరు ఉండేదని చెప్పేది. ఆ ఊరికి సంబంధించిన కథలే అమ్మమ్మ చెప్పేది. ఆ కథలు నాకెంతో నచ్చేవి. ఇలా నిజంగానే జరుగుతుందా? అని నాకెన్నో సందేహాలు ఉండేవి. గుళిగ, పంజుర్లి గురించి తెలుసుకోవా లనిపించేది. నేను విన్న ఆ కథలతో ఓ దర్శకుడు సినిమా తెరకెక్కిస్తాడని అనుకోలేదు. నా సోదరుడు రిషబ్‌శెట్టి దాన్ని సాధ్యం చేశాడు.

నేను బాల్యంలో విన్న కథలను తెరపై చూసి ఆశ్చర్యపోయా. దాని గురించి మాటల్లో చెప్పలేను. కథ తెలిసి నేనే ఇలా అయిపోతే.. కొత్తగా తెలుసుకున్న వారు ఏమయ్యారో అదే ‘కాంతార’ ఫలితం’ అని పేర్కొన్నారు. ‘రిషబ్‌శెట్టి అరుదైన దర్శకుడు, నటుడు ఆయన ప్రతిభ 24 విభాగాలను డామినేట్ చేస్తాడు. ‘కాంతార’ను ఈ స్థాయిలో తెరకెక్కించడం మరెవరి వల్ల సాధ్యమయ్యేది కాదు. మా అమ్మను ఉడుపి కృష్ణుడి ఆలయానికి తీసుకెళ్లాలనేది ఎప్పటి నుంచో నా కోరిక.

రిషబ్ వల్ల ఆ దర్శన భాగ్యం దక్కింది. తమ పనుల్నీ పక్కనపెట్టి రిషబ్ కుటుంబం మాతో కలిసి వచ్చింది. నన్ను కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారు. ఆ సమయంలోనే.. ఆ యన ‘కాంతార చాప్టర్ 1’ కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థమైంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అనుకు న్నంత తేలిక కాదు’ అని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం తనకు ఓ ప్రమాదంలో స్వల్ప గాయమైందని, అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నానని తెలిపారు.

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి మాట్లాడు తూ.. ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు. అంతకుమించిన సోదరుడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నా సొంత సోదరుడితో ఉన్న భావన కలుగుతుంది. నా సినిమాలు ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు  హృదయపూర్వక నమస్కారాలు. అదే ప్రేమతో కాంతార చాప్టర్-1ను ఆదరించాలని కోరుకుంటున్నానని తెలిపారు. తప్పకుండా అక్టోబర్ 2న ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. 

నటి రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నా ప్రతి సినిమాను ఎంతో ఆదరిస్తున్నారు. కాంతార చాప్టర్ -1ను ఆదరించాలని కోరారు. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. హోంబలే ఫిలిమ్స్ నుంచి వస్తున్న కాంతార చాప్టర్-1 చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని పిలుపునిచ్చారు. ప్రతి ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలని  విజ్ఞప్తి చేశారు.