12-12-2025 12:13:55 AM
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్
నాగర్ కర్నూల్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): జిల్లాలో స్కానింగ్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే, సంబంధిత వైద్యులపై, హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్ హెచ్చరించారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని శ్వేత స్కానింగ్ సెంటర్, ఎంఎంఆర్ హాస్పిటల్, శ్రీ సాయి హాస్పిటల్, మైత్రి హాస్పిటల్, శ్రీ చరిత్ర సాయి హాస్పిటల్ వంటి పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో రికార్డులు, స్కానింగ్ రిజిస్టర్లు, పేషెంట్ వివరాలను పరిశీలించారు.
గర్భిణీ మహిళలకు చేసిన అల్ట్రాసౌండ్ పరీక్షల నివేదికలను క్రాస్ చెక్ చేసి, లింగ నిర్ధారణకు సంబంధించిన ఎలాంటి సూచనలు కనిపించినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆసుపత్రుల బయట, లోపల స్పష్టంగా కనిపించేలా లింగ నిర్ధారణ నిషేధం బోర్డులు ప్రదర్శించాలన్నారు. గర్భిణీ స్త్రీలకు చట్టంపై అవగాహన కల్పించడం ప్రతి సెంటర్ బాధ్యత అని తెలిపారు.
జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పదంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టు తెలిసినా వెంటనే 8500879884కు కాల్ చేయాలని, వాట్సాప్ ద్వారా సమాచారం పంపవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని డాక్టర్ రవికుమార్ భరోసా ఇచ్చారు. తనిఖీల్లో జిల్లా ఉప మాస్ మీడియా అధికారి జి. రాజగోపాలాచారి, డిపిఎంవో మధుమోహన్, అచ్చంపేట డివిజన్ ఉప మలేరియా అధికారి బికులాల్ తదితరులు పాల్గొన్నారు.