08-12-2025 07:35:07 PM
జిల్లా కలెక్టర్ హైమావతి..
సిద్దిపేట కలెక్టరేట్: జిల్లాలో మొదటి విడతగా నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కె.హైమావతి తెలిపారు. ఆ తరువాత ఎలాంటి ప్రచారం నిర్వహించినా ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో గజ్వేల్, మర్కుక్, ములుగు, జగదేవపూర్, వర్గల్, రాయపోల్, దౌలతాబాద్ మండలాల్లోని గ్రామాల్లో 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి అనుమతి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అలాగే ఎన్నికల నిబంధనల మేరకు మొదటి విడత ఎన్నికలు జరిగే జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని మద్యం దుకాణాలను 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.