05-08-2025 12:58:19 AM
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
- ఆలయ నిర్మాణ సమస్యకు పరిష్కారం
ఎల్బీనగర్, ఆగస్టు 4 : ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఆలయ నిర్మాణానికి అడ్డుపడుతున్న వ్యక్తిని మందలించి సమస్యను పరిష్కరించారు. నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ రామాలయం ప్రాంగణంలో నూతన దేవాలయం పునర్నిర్మాణ పనులు చేస్తున్నారు. కాగా , ఆలయం పక్కనే ఉంటున్న ఒక వ్యక్తి అట్టి దేవాలయం మధ్యలో నుంచి దారి కావాలని, లేనిపక్షంలో డబ్బులు ఇవ్వాలని దేవాలయ కమిటీ సభ్యులను కొద్దీ రోజులుగా ఇబ్బంది పెడుతున్నాడు.
ఆలయ కమిటీ సభ్యులు, బండ్లగూడ గ్రామస్తులు సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు. ఇందులో భాగంగా సోమవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆలయ ప్రాంతంలో పర్యటిం చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన పత్రాలు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించి, ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్న పత్రాలు నకిలీ అని తేల్చిచెప్పారు. గతంలో దేవాలయం పక్కన ఉన్న రోడ్డును ఆక్రమించి నూతన ఇంటి నిర్మాణం చేపట్టి, మరొకరికి విక్రయించారని ఆలయ కమిటీ సభ్యులు ఆరోపించారు.
అనంతరం అధికారులు పత్రాలు పరిశీలించి దేవాలయం ఆవరణలో నుంచి రోడ్డు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిర్భయంగా దేవాలయం నిర్మాణం చేసుకోవచ్చు అని సూచిం చారు. దేవాలయ నిర్మాణ పనుల్లో ప్రైవేటు వ్యక్తులు జోక్యం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పక్కన ఉన్న రజక, కుమ్మర కులస్తులకు చెందిన శ్మశానవాటిక దగ్గర దాదాపు వంద గజాల స్థలాన్ని ఇదే వ్యక్తులు కబ్జా చేసి, నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది స్థలాన్ని పరిశీలించి, శ్మశానవాటికలో చేపట్టిన నిర్మాణాన్ని కూల్చివేశారు.
మళ్ళీ అదే స్థలంలో ఇప్పుడు నూతన నిర్మా ణం చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో స్థలాన్ని కాపాడాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేసుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తే చూ స్తూ ఊరుకోమని హెచ్చరించారు. వెంటనే ఆ స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటి కమిషనర్ వంశీకృష్ణ, టౌన్ ప్లానింగ్ అధికారి విజయలక్ష్మి, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, నాయకులు ఆనంతుల రాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్ గౌడ్, జగదీశ్వర్, శంకరయ్య, యాదయ్య, సుదర్శన్, రాములు గౌడ్, రాజు గౌడ్, భవాని శంకర్, లక్ష్మయ్య గౌడ్, పాండు గౌడ్, శ్రీనివాస చారి పాల్గొన్నారు.