26-11-2025 10:04:57 PM
చోరీలకు పాల్పడితే కఠిన చర్యలు: డిఎస్పి రాజశేఖర్ రాజు
మిర్యాలగూడ (విజయక్రాంతి): జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఈ వివరాలను మిర్యాలగూడ డి.ఎస్.పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పి రాజశేఖర్ రాజు వివరాలు వెల్లడించారు. హుజూర్ నగర్ పట్టణం దీక్షిత్ నగర్ కు చెందిన మందడి వినోద్(31) తాగుడుకు బానిసగా మారి పేకాట ఆడుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు. స్నేహితులు తెలిసిన వ్యక్తుల నుండి అప్పులు చేశాడు. అధికంగా అప్పులు కావడంతో అప్పులు తీర్చేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈనెల 14 న మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను బైక్ పై అనుసరించి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసుని లాక్కొని వెళ్ళాడు. ఇట్టి బంగారాన్ని హుజూర్నగర్ కు చెందిన తన స్నేహితురాలు షేక్ నజ్మాకి ఇవ్వగా ఆమె శ్రీరామ్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి రూ.2 లక్షల 30 వేలు లోను తీసుకొచ్చింది. ఈ డబ్బులను రూ.80000 అప్పు తీర్చారు. మిగిలిన రూ.1,50,000 పేకాటలో పోగొట్టుకున్నాడు. తిరిగి మరల చైన్ స్నాచింగ్ చేసేందుకు మిర్యాలగూడ రౌండు దగ్గర బైకుతో వేచి ఉన్న వినోద్ ను పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకొని విచారించారు. నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు.
అతని వద్ద నుంచి మూడు తులాల రెండు గ్రాముల బంగారు పుస్తెలతాడు, ఒక మొబైల్ ఫోన్, ఒక బైక్, శ్రీరామ్ ఫైనాన్స్ లో లోన్ పెట్టుటకు వాడిన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసును చేదించిన టూటౌన్ సిఐ సోమ నరసయ్య, ఎస్సై రాంబాబు, ఏఎస్ఐ చంద్రయ్య, స్వర్ణ నాయక్ అక్బర్ పాషా లక్ష్మయ్య రామకృష్ణ కళ్యాణ్ మణిదీప్ రాజశేఖర్ లను డి.ఎస్.పి అభినందించారు.