02-08-2025 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్, ఆగస్టు 1 : ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గంగిపల్లి గ్రామంలోని పల్లె దవాఖానా, కుందారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాలం అయినందున అంటువ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు పాటిం చవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
వార్డులు, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధులలో సమయపాలన పాటించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గంగిపల్లి పల్లె దవాఖానాలో విధులకు గైర్హాజరైన వైద్యులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గంగిపల్లి గ్రామం లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి వంటశాల, మూత్రశాలలు, తరగతి గదులు, పరిసరాలతో పాటు అదనపు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యాబోధన అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సత్యనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.