calender_icon.png 17 May, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుళ్లలో తేడాలొస్తే కఠిన చర్యలు

17-05-2025 12:00:00 AM

అకాల వర్షాలతో రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు

జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

కొండాపూర్, మే 16 : ధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ధాన్యం రవాణాలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు హెచ్చరించారు. శుక్రవారం   కలెక్టర్  కొండాపూర్ మండలం తొగర్ పల్లి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం, జొన్నల కొనుగోలు కేంద్రాలను సందర్శించి, నిర్వహణపై తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో అకాల వర్షాల దృష్ట్యా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల ధాన్యం తడిసిపోకుండా, నాణ్యత కోల్పోకుండా నిర్ధిష్ట చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు, గన్ని సంచులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. 

వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, ఐకెపి, శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దిష్ట మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు  చేయాలని, గన్ని సంచులు, టార్పాలిన్లు వంటి అవసరమైన సామగ్రిని ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు.

కేంద్రాలలో నిల్వ చేసిన ధాన్యాన్ని తక్షణమే రవాణా చేయాలని, రవాణాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ట్రాక్టర్లు, లారీల వినియోగానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తేమ శాతం కొంచెం  ఎక్కువగా వున్నా ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లకు, డీలర్లకు సూచించారు.

ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాలలో నేరుగా డబ్బులు జమయ్యేలా ఆన్లైన్లో ఖాతా వివరాలు సమర్థవంతంగా నమోదు చేయాలని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తడిసిపోకుండా ధాన్యాన్ని తక్షణమే తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రవాణా ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తుగా రవాణా ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు.

అదే కేంద్రంలో నిర్వహిస్తున్న జొన్నల కొనుగోలు కేంద్రాన్ని కూడా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం జొన్నలకు ఎంఎస్పీ  ద్వారా గిట్టుబాటు ధర రూ.3371 అందిస్తోందని, ఇది మార్కెట్లో రైతులకు వస్తున్న ధరతో పోలిస్తే రూ.1400 అధికమని తెలిపారు. ప్రతి ఎకరాకు 14 క్వింటాళ్ల మేరకు జొన్నలు కొనుగోలు చేస్తున్నందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ అశోక్, పి.ఎ.సి.ఎస్ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులుపాల్గొన్నారు.