17-12-2025 12:00:00 AM
ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 16, (విజయక్రాంతి):జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పి రోహిత్ రాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడో విడుతలో సమస్యాత్మక,సెన్సిటివ్,హైపర్ సెన్సిటివ్,క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పోలింగ్ సమయంలో ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు,శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, గొడవలు, సృష్టించినా ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలే ప్రసక్తే లేదని, వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు.ఎన్నికల సమయంలో కేసులు నమోదయితే భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురవుతారని అన్నారు.
జిల్లా ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించకోవాలని ఎస్పీ సూచించారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని కోరారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఊరేగింపులకు,ర్యాలీలకు అనుమతి లేదని బాణాసంచా కాల్చడం,డీజేలు ఏర్పాటు చేయడం నిషేధమని తెలియజేశారు.మూడో విడుతలో మొత్తం 249 పోలింగ్ స్థానాలలోని 1288 పోలింగ్ కేంద్రాలలో పోలీస్ శాఖ తరపున పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
సుమారుగా 1500 మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. 1288 పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలింగ్ కేంద్రాలు-619, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు-134,అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు-168,క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు-184,మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలు-183 లను గుర్తించినట్లు తెలిపారు.