24 April, 2026 | 1:46 AM

రెండవ రోజు కొనసాగిన సమ్మె

24-04-2026 12:00 AM

పోలీస్ ఎస్కార్ట్ తో అద్దె బస్సులు

కరీంనగర్, ఏప్రిల్23(విజయక్రాంతి):ఆర్టీసీలో ఉద్యోగులు సమ్మె ను గురువారం కూడా కొనసాగించారు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని డిపోల ఎదుట నిరసనలు తెలిపారు. అక్కడే బైఠాయించి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా అద్దె, ఎలక్ట్రికల్ బస్సులు నడిపించేందుకు అధికారులు శత ప్రయత్నాలు చేశారు. పోలీస్ ఎస్కార్ట్ తో కొన్ని రూట్లతో బస్సులు నడిపారు.  సమ్మె మరింత ఉధృతం చేసేందుకు జె ఏ సి కార్యాచరణ రూపొందించింది.

ఆర్టీసీ ఉద్యోగులు కొంత కాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇటు ప్రభుత్వం, అటు యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు. రెండు చోట్ల నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. గురువారం ఉదయం ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల ఎదుట నిరసనలు వ్యక్తం చేశారు. తాము యాజమాన్యం ముందు పెట్టిన 32 డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను గుర్తు చేశారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండు వేతన సవరణలు అమలు చేయడంతోపాటు యూనియన్లు ఏర్పాటు చేసి, ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి జేఏసీతో చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని ఉద్యోగులు చెప్పారు.కరీంనగర్ రీజియన్ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో 11 డిపోల నుంచి 410 వరకు అద్దె, ఎలక్ట్రానిక్ వాహనాలు నడిపినట్లు అధికారులు ప్రకటించారు.

మ్మెతో మిగతా 556 బస్సులు డిపోలకే పరిమితం కాగా, అద్దె బస్సుల్లో పనిచేసే కండక్టర్లు కూడా సమ్మెలో పాల్గొన్నారు. అయితే అధికారులు మొండితనంతో కండక్టర్లు లేకుండా, టికెట్లు తీసుకోకుండానే బస్సులు నడిపేందుకు ప్రయత్నించారు. టిమ్ మిషన్లపై అవగాహన లేకున్నా కొన్ని అద్దె బస్సు డ్రైవర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇటు మహిళలకు, అటు పురుషులకు కూడా టికెట్లు ఇవ్వకుండానే గమ్యస్థానాలకు చేర్చారు.పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, మంథని ఆర్టీసీ డిపోల నుంచి కొన్ని బస్సులను ప్రైవేట్ డ్రైవర్లతో టికెట్లు ఇవ్వకుండానే ఉచితంగా నడిపారు. సమ్మె పుణ్యమాని తమకు ఫ్రీ ప్రయాణం దొరికిందని పురుష ప్రయాణికులు సంతోషపడ్డారు.

ఇటు అధికారులు శుక్రవారం నుంచి బస్సుల సంఖ్యను మరింత పెంచే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తున్నది. డ్రైవర్కు రోజుకు వెయ్యి, కండక్టర్లకు 800 చెల్లిస్తామని అధికారులు ప్రకటన ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తున్నది. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు యాజమాన్యం కుట్రలు చేస్తున్నదని, శిక్షణ లేని వారితో బస్సులు నడిపించడం వల్ల ప్రయాణికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మెతో రెండవ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఇక్కట్లు పడ్డారు.

ప్రధాన డిమాండ్లను అంగీకరిస్తేనే ఆర్టీసీ ప్రధాన డిమాండ్లు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేయాలి పీఆర్సి 2021 2022 రిలీజ్ చేయాలి యూనియన్లను పునరుద్ధరించాలి ఈ మూడు ప్రధాన డిమాండ్ లను పరిష్కరించినట్లయితే వెంటనే సమ్మెను విరమించడానికి సిద్ధంగా ఉన్నాము.

డి. రాజయ్య జేఏసీ కో కన్వీనర్, కే. కోమల ఎస్సీ ఎస్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు, ఆర్టీసీ జేఏసీ నాయకురాలు