calender_icon.png 10 September, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి వ్యవస్థ పరిరక్షణకు పోరాటాలే శరణ్యం

10-09-2025 06:37:27 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు మాత్రమే శరణ్యమని సిఐటియు సీనియర్ నాయకులు ఎస్.వీరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా కమిటీ నాయకురాలు సులోచన నాయకత్వంలో వివిధ సంఘాల నుండి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 500 మంది సిఐటియులో చేరారు. సిఐటియు నాయకులు వీరయ్య, భాస్కర్ సమక్షంలో చేరిన అంగన్వాడీలకు కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దేశాన్ని తాకట్టు పెట్టి కార్మికుల పొట్ట కొట్టేందుకు, 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా చేసి కార్మికులకు హక్కులు లేకుండా కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగా పీఎం శ్రీవిద్య, నూతన విద్యా విధానం పేరుతో అంగన్వాడి సెంటర్లను మూసి వేయడానికి రంగం సిద్ధం చేస్తుందని, వీటికి వ్యతిరేకంగా అంగన్వాడీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్, కుమ్మరి కుంట్ల నాగన్న, సమ్మెటరాజమౌళి, దుండి వీరన్న కందునూరి శ్రీనివాస్ మల్లయ్య అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి ధారా స్నేహ బిందు, మంగ వీరలక్ష్మి, మల్లికాంబ, సలీమా తదితరులు పాల్గొన్నారు.