calender_icon.png 11 September, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరుధాన్యాల ఉత్పత్తులతో అధిక లాభాలు

10-09-2025 08:53:43 PM

కె.వి.కె కోఆర్డినేటర్ డాక్టర్ డి నరేష్..

గరిడేపల్లి (విజయక్రాంతి): ఆధునిక సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న కలుషితమైన ఆహారం నుంచి మానవాళిని రక్షించుకోవాలంటే చిరుధాన్యాలతో సాధ్యమవుతుందని, వాటి ఉత్పత్తితో అధిక లాభాలు కూడా పొందవచ్చునని గడ్డిపల్లి కె.వి.కె ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి నరేష్ తెలిపారు. కెవికెలో బుధవారం చిరుధాన్యాలు వాటి విలువ దారిత ఉత్పత్తులపై యువతులకు మహిళలకు నిర్వహించే మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎన్ సుగంధి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ డి నరేష్ పాల్గొని మాట్లాడుతూ, చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకుని మార్కెటింగ్ చేపట్టడం ద్వారా యువత స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు.

ప్రస్తుతం కలుషితమైన ఆహారం అంతట వ్యాపించిందని, దీంతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలను ఉపయోగించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చని అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. చిరుధాన్యాలలో మానవాళి మనుగడకు అవసరమయ్యే పోషక విలువలు ఉంటాయని, 40 సంవత్సరాల క్రితం పెద్దలు అందరూ చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకునేవారని ఆయన గుర్తు చేశారు. మళ్లీ కాలం తిరిగి వచ్చినట్లుగా ప్రస్తుతం ఆహారం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఏర్పడిందన్నారు.దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కలుషితమైన ఆహారానికి దూరంగా ఉంటూ స్వచ్ఛమైన చిరుధాన్యాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలను పొందవచ్చని తెలిపారు.ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పై దృష్టి పెట్టిన కారణంగానే ఇటీవల చిరుధాన్యాల వినియోగం పెరిగిందని,తద్వారా ప్రతి ఒక్కరు ఆహారపు అలవాట్లను మార్చుకునే అవకాశం కలిగిందని తెలిపారు.

చిరుధాన్యాలు అంటే జొన్నలు,సజ్జలు,రాగులు,కొర్రలు తదితర వాటిని వినియోగించుకోవడం ద్వారా ప్రతి కుటుంబం సమతుల్యమైన పోషక విలువలు పొంది ఆరోగ్యవంతంగా నిలుస్తుందని  తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో విపరీతంగా రసాయనిక మందులను వినియోగించడంతో ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత కోల్పోవడమే కాక  విషపూరితమైన అవశేషాలు ఉంటాయని సాంకేతికమైన పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు రుజువు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు చిరుధాన్యాల  ఉత్పత్తులు వాడకం పెరగాలని ఆయన సూచించారు. గృహ విజ్ఞాన శాస్త్రవేత్త సుగంధి మాట్లాడుతూ చిరుధాన్యాలైన రాగులు జొన్నలు, సజ్జలు, కొర్రలు తదితర వాటితో అనేక రకాల విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయవచ్చని తెలిపారు. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ చిరుధాన్యాల ద్వారా బిస్కెట్స్, కేక్, లడ్డు, మురుకులు తదితర వాటిని తయారు చేయవచ్చని తెలిపారు. చిరుధాన్యాలతో తయారు చేసే ఉత్పత్తుల విధానంపై ఆమె వివరించారు. కార్యక్రమంలో కె వి కె శాస్త్రవేత్తలు ఏ కిరణ్, సిహెచ్ నరేష్, డి ఆదర్శ్, పి అక్షిత్, గరిడేపల్లి, సూర్యాపేటకు చెందిన 42 మంది మహిళలు, యువతులు తదితరులు పాల్గొన్నారు.