calender_icon.png 10 November, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెంపపై కొట్టడంతో చెవులోంచి రక్తస్రావం

10-11-2025 04:01:40 PM

తల్లిదండ్రులకు చెప్పకుండానే ఆసుపత్రిలో వైద్య చికిత్సలు 

విద్యార్థి సిద్ధార్థ పాఠశాలలో తీవ్ర ఆందోళనలు 

కొట్టకుండా విద్యాబోధన చేస్తామంటూ ప్రచారం

శ్రీ స్వామి నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు 

జడ్చర్ల: పట్టణంలో ఓ విద్యార్థి పై ఉపాధ్యాయుడు దాడి ఘటన కలకలం రేపింది. స్థానిక శ్రీ స్వామి నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి బొడ్డుపల్లి సిద్ధార్థ చారిపై గణితశాస్త్ర ఉపాధ్యాయుడు వ్యవహరించిన ఘటనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుడు విద్యార్థి చెంపపై బలంగా కొట్టడంతో ఎడమ చెవి నుండి రక్తస్రావం ప్రారంభమైంది. గాయపడిన విద్యార్థిని ఇతరులు చూసి ఆస్పత్రికి తరలించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంతో పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడిని చూపించాలని డిమాండ్ చేశారు. వారి ఆవేశం తీవ్రరూపం దాల్చడంతో పాఠశాల కార్యాలయ తలుపులు పెద్దలు కొట్టారు.  తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఘటన జరిగిన తరువాత కూడా పాఠశాల అధికారులు తమకు సమాచారం ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే పాఠశాలలో గతంలో నిశాంత్ అనే మరో విద్యార్థిని కూడా కొట్టడంతో చెవిలో రక్తస్రావం జరిగినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

పాఠశాలలో ఇలాంటి ఘటనలు పదేపదే జరుగుతుండడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విద్యాశాఖ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. విద్యార్థుల భద్రతను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఈ ఘటనతో జడ్చర్ల పట్టణంలో విద్యాసంస్థల భద్రత, ఉపాధ్యాయుల ప్రవర్తనపై చర్చ చెలరేగింది. తల్లిదండ్రులు విద్యార్థులపై హింసకు పాల్పడే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అంత గట్టిగా కొట్టేందుకు ఆ ఉపాధ్యాయుడుకు ఆ విద్యార్థిపై ఏమి హక్కు ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బిడ్డకు ఏమన్నా అయితే ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాల అంటూ ప్రచారం చేసుకుంటూ పిల్లలను శారీరకంగా ఇన్ని ఇబ్బందుల గురి చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన కూడా తమ సమాచారం ఇవ్వకుండా ఏం చేద్దాం అనుకున్నారు మా బిడ్డను అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.