10-11-2025 05:21:24 PM
శాఖల అధికారులు సమన్వయంతో పని చేయండి
శనివారంలోగా శిక్షణ పూర్తి చేయాలి
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): చిన్న నీటి పారుదల వనరుల సర్వే పకడ్బందీగా చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. చిన్న నీటి పారుదల వనరుల సర్వే పై డీఆర్డీఓ, వ్యవసాయ, ఈఈ పీఆర్, నీటి పారుదల శాఖ, సెస్, సీపీఓ తదితర శాఖల డిస్ట్రిక్ట్ లెవెల్ స్టీరింగ్ కమిటీ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని చిన్న నీటి పారుదల వనరుల సర్వే ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు వేల హెక్టార్ల లోపు విస్తీర్ణం ఉన్న జల వనరుల సర్వే మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. ఛార్జ్ ఆఫీసర్ గా తహసిల్దార్, ఎంపీఎస్ఓ, నీటిపారుదల శాఖ ఏఈలు సూపర్వైజర్ గా ఉంటారని, జీపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏఈఓలు ఎన్యూమరేటర్లుగా కొనసాగుతారని తెలిపారు.
జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు ఇతర జల వనరుల వివరాలు సేకరించడంపై అందరూ ఎన్యూమరేటర్లకు ఆయా తహసీల్ కార్యాలయాల్లో తహసిల్దార్, ఎంపీఎస్ఓ, నీటిపారుదల శాఖ ఏఈలు, ఎంపీడీఓలు ఈ సర్వేపై శనివారంలోగా శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖ ఇతర శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన వివరాలను సర్వే చేస్తున్న అధికారులకు అందజేయాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, సీపీఓ శ్రీనివాసాచారి, డీఆర్డీఓ శేషాద్రి, డీఏఓ అఫ్జల్ బేగం, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిషోర్ కుమార్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.