10-11-2025 05:05:45 PM
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారించింది. సోమవారం రాజస్థాన్, తెలంగాణలో జరిగిన రహదారి ప్రమాదాలకు సంబంధించిన కేసులను జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం స్వయంగా స్వీకరించింది. జాతీయ రహదారులపై అనుమతి లేకుండా ఎన్ని ధాబాలు ఉన్నాయో రెండు వారాల్లోగా సర్వే నిర్వహించాలని తెలిపింది. రహదారి నిర్వహణ పరిస్థితులపై నివేదికలను సమర్పించాలని సుప్రీంకోర్టు సోమవారం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. రహదారి పరిస్థితులు మరియు నిర్వహణ సమయంలో కాంట్రాక్టర్లు పాటించే నిబంధనల వివరాలను కూడా కోర్టు కోరింది.
భారత కేంద్ర హోం మంత్రిత్వ శాఖను, రహదారులు వెళ్ళే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కూడా పార్టీగా చేర్చాలని కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా జస్టిస్ మహేశ్వరి మాట్లాడుతూ... ధాబాలు తరచుగా రోడ్డు అంచున ఉంటాయని, ప్రజలు తమ ట్రక్కులను ఆపి ధాబాల వద్దకు వెళతారు. వేగంగా వచ్చే ఇతర వాహనాలు వాటిని ఢీకొంటాయి. ఫలోడి, తెలంగాణలో జరిగిన ప్రమాదాలలో వరుసగా 18, 19 మంది మరణించారని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.
టోల్ వసూలు చేసినప్పటికీ రోడ్డు పరిస్థితులు సరిగా లేకపోవడం, అనధికార ప్రాంతాలలో ధాబాలు ఉండటం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని వార్తాలు వస్తున్నాయని ఆగ్రహించింది. నవంబర్ 2న జరిగిన ఫలోడి ప్రమాదంలో జోధ్‌పూర్ నుండి బికనీర్‌కు యాత్రికులను తీసుకెళ్తున్న టెంపో ట్రావెలర్ భరత్‌మాల హైవేలోని ఒక తినుబండారం దగ్గర ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది మరణించారని ధర్మాసనం స్పష్టం చేసింది.