calender_icon.png 15 October, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తీర్చిదిద్దాలి

14-10-2025 10:48:45 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..

హనుమకొండ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను మెరుగుపరిచి, ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మంగళవారం హనుమకొండ జిల్లా నడికుడ మండలం రాయపర్తిలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, రెండు అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఉన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించారు. పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన స్థాయిలను పరీక్షించారు. పాఠశాలల్లో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ఉపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం అమలు తీరు గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి  కలెక్టర్ అడిగి తెలుసుకుని వంట గదులను పరిశీలించి మెనూ గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతిని మరింత మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఉన్న రెండు అంగన్వాడి కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు అందిస్తున్న మెనూ చార్ట్ ను జిల్లా కలెక్టర్ అంగన్వాడీ టీచర్లను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు అందిస్తున్న కార్యక్రమాలను గురించి ఆరా తీశారు. అంగన్వాడి కేంద్రాలలోని వంట గదులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, తహసీల్దార్ రాణి, మండల విద్యాశాఖ అధికారి హనుమంతరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల స్వామి, భరత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.