25-10-2025 08:47:51 PM
పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎం.ఈ.ఓ చత్రు నాయక్
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని మండల విద్యాధికారి పాను గోతు చత్రునాయక్ కోరారు. మండలంలోని గరిడేపల్లి కస్తూర్బా పాఠశాలను,కల్మలచెరువు గ్రామంలోని పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన రికార్డులను, పాఠశాల పరిసరాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు ఎస్ఏ 1 పరీక్షలు నిర్వహించిన అనంతరం మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.
పాఠశాలలో ఏ ఏ పి సి కి సంబంధించిన మరమ్మత్తులను ఆయన పరిశీలించారు.యు డైస్ ప్లస్ లో ఉన్న పెండింగ్ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు.అప్పర్ ఐడి వెంటనే జనరేట్ చేయాలని కోరారు. ఎండిఎం మెసేజ్ ను ఆన్లైన్లో ప్రతిరోజు పొందుపరచాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. 9,10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు.
పదవ తరగతి విద్యార్థులను గ్రూపులుగా ఏర్పాటు చేసి లిటిల్ టీచర్లను ఏర్పాటు చేయాలని, విద్యార్థులు అందరూ చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు వచ్చే విధంగా చూడాలన్నారు. సోమవారం, మంగళవారం తప్పని పరిస్థితుల్లో తప్ప ఎవరు కూడా సెలవు పెట్టుకోకూడదని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వీరబాబు, కస్తూర్బా పాఠశాల ఎస్ఓ శైలజ, వెంకటేశ్వర్లు, కల్పన, రవి, ఏఏపిసి చైర్మన్ పాశం అరుణ, సి.ఆర్.పి లు రామకృష్ణ, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.