calender_icon.png 20 September, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్ కు సర్ ప్రైజ్

20-09-2025 07:07:09 PM

పూలు చల్లి శాలువా‌కప్పి, చాక్లెట్లు తినిపించి..

రైతుల ఆశాజ్యోతి పులి రాజుకు విద్యార్థుల సత్కారం..

గజ్వేల్ (విజయక్రాంతి): వర్గల్ మండలం తునికి ఖాల్సా ప్రాధమిక పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుడు పులి రాజును ఒక్కసారిగా వచ్చి సన్మానించి ఆశ్చర్యపరిచారు. ఉపాధ్యాయుడు పులి రాజు రాష్ట్రవ్యాప్తంగా గత 25 సంవత్సరాలుగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడు. రాష్ట్రంలో ఎక్కడ రైతు ఆత్మహత్య జరిగిన ఆ ప్రాంతానికి వెళ్లి ఆ కుటుంబం యొక్క స్థితిగతులు ఆత్మహత్యకు గల కారణాలు వంటి వివరాలు అడిగి తెలుసుకుని ఆ కుటుంబానికి దాతల సహకారంతో సహాయం అందిస్తున్నాడు. ముఖ్యంగా ఆ రైతు కుటుంబంలో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే వారికి ఉన్నత విద్య చదువుకోవడానికి తోడ్పాటు అందిస్తున్నాడు. సార్ సేవలను పిల్లల తల్లిదండ్రుల వాట్సప్ స్టేటస్ లలో, వార్త పత్రికలలో గమనించిన విద్యార్థులు సార్ ను సన్మానించాలనుకున్నారు. పిల్లలంతా వారి, వారి ఇండ్ల వద్ద నుండి పూలను తీసుకువచ్చారు. అన్ని ఒక కవర్లో పోసుకున్నారు. రోజులాగే పాఠశాలకు వచ్చి ప్రేయర్ పూర్తికాగానే ఉపాధ్యాయుడు పులి రాజు అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకుని నాలుగవ తరగతి గదిలోకి రాగానే పూలు చల్లి స్వాగతం పలికారు.

అనంతరం పిల్లలందరూ సార్ చేతులు పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టి శాలువా కప్పి పెద్ద మనస్సు చాటుకున్నారు. అప్పటికి ఉపాధ్యాయుడు పులి రాజుకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పిల్లలు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. నేను బదిలీ అయి వెళ్లడం లేదు, రిటైర్మెంట్ కాలేదు, నా బర్త్ డే కూడా కాదు ఎందుకు నన్ను  సన్మానిస్తున్నారు బిడ్డ! అని ప్రశ్నించిన సార్ కు ఆ విద్యార్థులు ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చారు. మీరు రైతులకు చేస్తున్న సేవలు చూసి మాకు చాలా బాధ అనిపించింది మీరు చేస్తున్న ఆ సేవ మమ్మల్ని ఆకర్షించాయి. సార్ మేము రైతు కుటుంబాల నుండి వచ్చాము మా తల్లిదండ్రులు వ్యవసాయమే చేస్తారు. అటువంటి రైతుల్ని పట్టించుకున్న మిమ్మల్ని సన్మానించుకోవాలనుకున్నము సార్ అని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా  విద్యార్థులు నేను డాక్టర్ నై రైతులకు ఉచితంగా సేవ చేస్తానని, మరో విద్యార్థి కలెక్టర్ నై రైతులందరికీ ఉచితంగా ఇల్లు కట్టిస్తానని, నేను కూడా టీచర్ అయి రైతు కుటుంబాల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తానని ఇంకో విద్యార్థి చెప్పడంతో ఉపాధ్యాయున్ని భావోద్వేగానికి గురిచేసింది.