24-07-2025 12:12:54 AM
విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 23: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు చికుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం జలకళ సంతరించుకుంది. ఈ జలపాతం అందాలు పర్యాటకులను కనులవిందు చేస్తున్నాయి. అయితే బొగతా జలపాతం వైపు వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాటర్ ఫాల్స్ వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఏజెన్సీ ప్రాంతం ప్రకృతి సోయగాల సుందర దృశ్యాలతో కనువిందు చేస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బయ్యారం మండలం చింతోని గుంపు వాటర్ ఫాల్స్ వరద ఉధృతితో కనువిందు చేస్తున్నాయి. జల పరవళ్ళు రువ్వడితో వాటర్ ఫాల్స్ ప్రాంతం పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు ఏజెన్సీ ప్రాంతంలో దట్టమైన అడవిలో ఉన్న భీముని పాదం జలపాతం పాలధారలా జాలువారుతోంది. 20 అడుగుల ఎత్తు నుంచి దిగువకు దుముకుతూ ప్రవహిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతం జాలువారుతు సవ్వడి చేస్తోంది.