25-10-2025 06:40:48 PM
క్రమశిక్షణతో అడుగులు వేస్తే విజయం వరిస్తుంది..
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ రూరల్: తమ తమ జీవితంలో స్థిరపడితే వచ్చే ఆనందమే వేరని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) రూ.30 లక్షలతో నిర్మించిన సిసి రోడ్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ విద్యుత్ దీపాలను ప్రారంభించారు. అనంతరం కళాశాల లైబ్రరీ హాల్లో జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మన మహబూబ్ నగర్ జిల్లాలోని మైనారిటీ విద్యార్థుల కోసం ఓ చక్కటి ఇంజనీరింగ్ కాలేజ్ అందుబాటులో ఉందని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో మహబూబ్ నగర్ కు ఎన్నో గొప్ప గొప్ప విద్యాసంస్థలు వచ్చాయని అందులో భాగంగా ఐఐఐటి కళాశాల ఒకటని అన్నారు. అంతే కాకుండా పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మరియు లా కళాశాలతో పాటు మైనారిటీ విద్యార్థుల కోసం జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల రావడం జరిగిందని చెప్పారు. మహబూబ్ నగర్ లో సుమారు 3 లక్షల మంది మైనారిటీ విద్యార్థులు ఉన్నారని, మైనారిటీ విద్యార్థులు, పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలన్న లేదా హైదరాబాద్ లోని కళాశాలలో చదువుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది అని, అది వారికి భారంగా మారే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
అలాంటి విద్యార్థులకు జికే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల బాసటగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు తనవంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ , నాయకులు మల్లు అనిల్ కుమార్ రెడ్డి, గోనెల శ్రీనివాస్, ఖాజా , రాజు గౌడ్, గోవింద్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.