calender_icon.png 18 December, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పట్లో వారు.. ఇప్పుడు వీరు పంచాయతీ సర్పంచులే

18-12-2025 07:38:51 PM

ఒకే ఇంట్లో వరుసగా ఎన్నికల్లో పోటీ విజయం

అచ్చంపేట: ఇటీవల వెలువడిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో మూడో విడత నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా ఒకే కుటుంబానికి చెందిన వారు వరుసగా గెలువడం ప్రత్యేకతను సంతరించుకుంది.

* గతంలో భర్త.. ఇప్పుడు భార్య

అచ్చంపేట మండలం మార్లపాడుతండా గిరిజన గ్రామం. గ్రామాన్ని ఎస్టీకి రిజర్వు చేశారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన ఎన్నికల్లో గ్రామానికి చెందిన కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి రామవత్ జ్యోతి సర్పంచిగా విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై 37 ఓట్ల ఆధిక్యతను సాధించారు. ఆమె భర్త భాస్కర్ నాయక్ 2019  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది. సర్పంచిగా ఐదేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆయన న్యాయవాధిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వీరిది రాజకీయ కుటుంబం కావడం.. ప్రజల్లో ఆధరణ ఉండటంతో వరుసగా రెండో సారి సర్పంచి పదవి వారి ఇంటిలోని వారినే వరించింది. దీంతో వారి కుటుంబంతో పాటు.. గ్రామంలో సందడి నెలకొంది.

* అమ్మా.. భార్య.. భర్త: హ్యాట్రిక్ సర్పంచులు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వేర్వేరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా గెలుపొందారు. అలా సర్పంచిగా గెలుపొందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, భార్య, భర్త ఉండటం విశేషం. బల్మూర్ మండలం వీరంరామాజిపల్లికి చెందిన పానుగంటి మనోహర్ ఇటీవల నిర్వహించిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచిగా గెలుపొందారు. జనరల్ స్థానంలోనూ ఆయన విజయాన్ని నమోదు చేశారు.

ఆయన బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయన భార్య పానుగంటి జ్యోతి గెలుపొంది సర్పంచిగా ప్రజలకు సేవలందించారు. అలాగే 2000 గ్రామపంచాయతీ ఎన్నికల్లో మనోహర్ తల్లి పానుగంటి పార్వతిమ్మ గెలుపొంది ఉమ్మడి వీరంరామాజిపల్లి సర్పంచిగా పనిచేశారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన తల్లితో పాటు వరుసగా భార్య, భర్త సర్పంచిగా ఎన్నికై తమదైన హ్యాట్రిక్ సర్పంచు ముద్రను వేసుకున్నారు.