02-12-2025 10:08:19 PM
చట్టవిరుద్ధ రవాణాపై ఎప్పటికప్పుడు పోలీసు కట్టడి..
జిల్లా ఎస్పీ సునిత రెడ్డి..
వనపర్తి క్రైమ్: గ్రామ పంచాయతి ఎన్నికల సందర్భంగా నిబంధనల అమలులో ఏ మాత్రం రాజీ లేకుండా, అక్రమ నగదు-మద్యం రవాణాను పూర్తిగా అరికట్టే దిశగా చెక్‌పోస్టులు కఠిన నిఘా కేంద్రాలుగా పనిచేయాలని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి స్పష్టం చేశారు. గ్రామపంచాయతి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గోపాలపేట్ పోలీ స్టేషన్ పరిధిలోని బుద్దారం చెక్‌పోస్ట్‌ను ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించారు. చెక్‌పోస్ట్ వద్ద నిర్వహిస్తున్న వాహన తనిఖీలను ప్రత్యక్షంగా పరిశీలించారు. సిబ్బంది నిర్వహిస్తున్న రిజిస్టర్ నమోదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎన్నికల ప్రభావానికి దారి తీసే అక్రమ నగదు, మద్యం, విలువైన వస్తువుల రవాణాను అరికట్టాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా ఎస్పీ సిబ్బందితో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు చోటుచేసుకోకుండా కఠినంగా పర్యవేక్షించడం మన బాధ్యత” అని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు గమనించినప్పుడు వెంటనే పోలీసులుకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం పోలీసుల కర్తవ్యమైతే అక్రమ డబ్బు, మద్యం ప్రలోభాలను నిరోధించడం ప్రజల భాగస్వామ్యం. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అన్నారు.