05-11-2025 01:48:32 AM
-ఆ కానిస్టేబుల్ బలవన్మరణం బాధాకరం
-యువత ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస కావొద్దు
-పోలీస్ కమిషనర్ సజ్జనార్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి) : చట్టాన్ని అమలు చేస్తూ, నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన ఓ యువ కానిస్టేబుల్, వ్యసనమనే ఊబిలో చిక్కుకుని ఉసురు తీసుకున్నాడు. సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ కొఠారి సందీ ప్ కుమార్ (23) ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు బానిసై, అప్పుల పాలవ్వడమే ఈ దారుణానికి దారితీసిందని ప్రాథ మిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ అనే మహమ్మారి ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిలువుటద్దం. దాని అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఒక కానిస్టేబులే దానికి బలికావడం అత్యంత బాధాకరం, అని ఆయ న పేర్కొన్నారు. జీవితంలో ఒడిదొడుకులు, కష్టనష్టాలు సహజం. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప, ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తాయి. చనిపోవాలనే ఆలోచనను దరిచేరనీయవద్దు.
మానసిక ఒత్తిడికి గురైనప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలి, అని సజ్జనార్ యువతకు సూచించారు.కాగా ఈ ఘటన టెక్నాలజీ యుగంలోని చీకటి కోణాన్ని మరోసారి కళ్లకు కట్టింది. వినోదం కోసం మొదలైన ఆన్‌లైన్ గేమ్స్, సులభంగా డబ్బు సంపాదించవచ్చనే దురాశతో బెట్టింగ్‌ల వైపు మళ్లి, చివరికి ఎంతోమంది యువత జీవితాలను నాశనం చేస్తున్నాయి.
సందీప్ ఉదంతం ప్రతీ తల్లిదండ్రులకు, యువతకు ఒక హెచ్చరిక. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంది కదా అని, కనిపించే ప్రతి యాప్‌ను నమ్మితే, జీవితాలు ఎలా తలక్రిందులవుతాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, యువతలో ఈ వ్యసనంపై విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.