calender_icon.png 15 August, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సుందర్ మేనియా

25-10-2024 12:00:00 AM

  1. ఏడు వికెట్లతో మెరిసిన స్పిన్నర్ 
  2. న్యూజిలాండ్ 259 ఆలౌట్ 
  3. భారత్, కివీస్ రెండో టెస్టు

1 - సుందర్ టెస్టుల్లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

6 - భారత్ తరఫున టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో అన్ని వికెట్లు స్పిన్నర్లే పడగొట్టడం ఇది ఆరోసారి.

కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తన వేటను ఘనంగా ప్రారంభించింది. కాన్పూర్ వేదికగా మొదలైన టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. గిల్ (10*), జైస్వాల్ (6*) క్రీజులో ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 243 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డెవన్ కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్థసెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ మూడు వికెట్లు తీశాడు.

కివీస్ బ్యాటర్లు తమ వికెట్లను స్పిన్నర్లకే సమర్పించుకోవడం విశేషం. మొదటి రెండు సెషన్లు నిలకడగా ఆడిన న్యూజిలాండ్ చివరి సెషన్‌లో మాత్రం చేతులెత్తేసింది. 197/3 తో పటిష్టంగా కనిపించిన కివీస్ చివరి ఏడు వికెట్లను 62 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.

రీఎంట్రీ అదుర్స్..

ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. రాహుల్, సిరాజ్, కుల్దీప్ స్థానంలో గిల్, ఆకాశ్ దీప్, సుందర్‌లు జట్టులోకి వచ్చారు. 2021 మార్చిలో చివరి టెస్టు ఆడిన సుందర్ మూడేళ్ల తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. తన ఆఫ్ స్పిన్‌తో  కివీస్ బ్యాటర్లను ఆడుకున్న సుందర్ ఏడు వికెట్లు పడగొట్టి కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేసుకున్నాడు.

ఈ ఏడింటిలో ఐదు వికెట్లు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేయడం ద్వారా సాధించడం విశేషం. ఒక దశలో కాన్వే, రచిన్ రవీంద్రలు క్రీజులో పాతుకుపోవడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా సాగుతున్నుట్లు అనిపించింది. కానీ టీ విరామం తర్వాతి సెషన్‌లో ఒక ఎండ్‌లో సుందర్.. మరో ఎండ్‌లో అశ్విన్ ఎదురుదాడి చేయడంతో న్యూజిలాండ్ టపాటపా వికెట్లు కోల్పోయింది.

ఇక మూడు వికెట్లు పడగొట్టిన అశ్విన్ (531 వికెట్లు) ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్‌ను అధిగమించాడు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించగా.. పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో గిల్, జైస్వాల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు.

మ్యాచ్‌కు తొలిరోజు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 18 వేల మంది హాజరవ్వగా.. వారికి వాటర్ బాటిల్స్ అందించడంలో విఫలమయ్యారు. దీంతో ఆగ్రహం చెందిన అభిమానులు ముంబై క్రికెట్ అసోసియేషన్‌పై నిరసన వ్యక్తం చేశారు.