16-08-2024 12:00:00 AM
చలాది పూర్ణచంద్రరావు :
అమెరికాలోని ప్రముఖ విమాన తయారీ సంస్థ ‘బోయింగ్’ త యారు చేసిన ‘స్టార్ లైనర్’ రాకెట్‌లో అం తర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కి వెళ్లి కేవలం 8 రోజుల్లో తిరిగి వచ్చేలా నాసా రూపొందించిన ప్రయోగం ఇప్పు డు అక్కడికి వెళ్లిన ఇద్దరు వ్యోమగాముల ప్రాణం మీదికి వచ్చింది. పరిశోధనలకు వెళ్లిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి విల్మోర్ వ్యోమ వాహక నౌకకు అనుకోకుండా ఎదురైన సాంకేతిక ఇబ్బందుల కారణంగా అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు, ఇంకా చెప్పాలంటే 2025 ఫిబ్రవరి వరకు తిరిగి రాలేక ‘త్రిశంకు స్వర్గం’లో వుండాల్సిన స్థితి ఏర్పడింది.
‘త్రిశంకు స్వర్గం’ అనే మాటను మనం తరచూ వింటాం. త్రిశంకు అనే రాజు ఇక్ష్వాకు రాజ వంశానికి చెందిన వాడు. సత్యహరిశ్చంద్రుడి తండ్రి, నీతిమంతుడైన రాజుగా రామాయణంలో వర్ణితమైంది. ఆయన తాను ఉన్న రూపంతో భౌతిక దేహంతో స్వర్గానికి వెళ్లాలనుకున్నాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో శాపవశాత్తు ఆయన చండాలుడుగా రూపు దాలుస్తాడు. అంతట ఆయన విశ్వామిత్రుడిని ఆశ్రయిస్తాడు. ఆ ముని త్రిశంకుని తన తపశ్శక్తితో పైకి పంపాడు.
త్రిశంకుడు ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకు పోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి, “త్రిశంకా! నువ్వు గురు శాపానికి గురయ్యావు. నీకు స్వర్గలోక ప్రవేశం లేదు. కనుక తలకిందులుగా కిందకి పో” అని ఆదేశించాడు. అలా త్రిశంకు తలకిందులుగా భూమిపైకి తోసివేతకు గురయ్యాడు. కిందకి పడిపోతూ ఆయన విశ్వామిత్రుడిని ప్రార్థిస్తాడు. విశ్వామిత్రుడు తిరిగి తపశ్శక్తితో త్రిశంకుని ఆకాశంలోనే ఆపి, దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని, సప్తర్షులనూ సృష్టించాడు. కానీ, దేవతలు అప్పటికి కూడా రాక పోయేసరికి దేవతలనూ సృష్టిద్దామని అనుకుంటాడు. హడావిడి పడిన దేవతలందరూ పరుగున వచ్చారు.
వారు విశ్వామిత్రునితో “మహానుభావా! శాంతించు. ఎంత తపశ్శక్తి ఉంటే మాత్రం ఇలా మరో స్వర్గాన్ని సృష్టిస్తారా? మీకు శాస్త్రం తెలుసు. సశరీరంగా ఎవరినీ స్వర్గానికి అనుమతి ఇవ్వటం కుదరదు. మీలాంటివారు చెయ్యవలసిన పని కాదు ఇది” అన్నారు. “మీరు మీ తపశ్శక్తిని ధారపోసి సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యో తిష చక్రానికి అవతల ఉంటుంది. అందు లో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు” అని వరం ఇచ్చారు దేవతలు. శాంతించిన విశ్వామిత్రుడు “సరే” అన్నాడు. అలా స్వ ర్గానికి అటు వెళ్లలేక, ఇటు భూమికి రాలేక త్రిశంకుడు తలకిందులుగా శూన్యంలో ఉండటాన్నే ‘త్రిశంక స్వర్గం’ అంటారు.
అనుకోని అవాంతరాలు
కేవలం 8 రోజుల ప్రయాణ కాలంగా నిర్ణయించి వారం లోపల తిరిగి వచ్చేలా బోయింగ్ సంస్థకు చెందిన ‘స్టార్ లైనర్’ని జూన్ 5 న ప్రయోగించారు. భూమినుండి సుమారు 400 కి.మీ. ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్)కి వెళ్లి న ఆ వ్యోమనౌక 6న ఐఎస్‌ఎస్‌కి అనుసంధానం అయింది. దానిలో ఇద్దరు వ్యోమ గాములు భారతీయ సంతతికి చెందిన మహిళ, పద్మభూషణ్ సునీతా విలియమ్స్ (58), బుచ్ విల్మోర్ (61) వెళ్లారు. స్టార్ లైనర్‌లో హీలియం లీకేజి, కొన్ని థ్రస్టర్లు షట్‌డౌన్ కావడం లాంటి సాంకేతిక లో పాలు తలెత్తాయి. దాంతో అది తిరిగి రావటానికి సురక్షితం కాదని ఐఎస్‌ఎస్‌లోనే వారిని ఉండాలని కోరిన నాసా దాని మరమ్మతులకు ప్రయత్నించినా సఫలం కాలే దు. ఎనిమిది రోజులకు తిరిగి రావాల్సిన ఆ ఇరువురు వ్యోమగాములు రెండున్నర నెలలయినా భూమికి చేరలేకపోయారు. ఫలితంగా వారి పరిస్థితి ‘త్రిశంకు స్వర్గం’ లో ఉన్నట్లుగా వుంది.
వారు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎ నిమిది నెలల తర్వాత కానీ వచ్చే అవకాశం లేదు. పైగా ‘త్రిశంకు స్వర్గం’ లాంటి అంతరిక్షంలో భూమికి 400 కి.మీ. దూరంలో ఇంకా 6 నెలల పాటు అక్కడే ఉండాలని తెలిస్తే మానసికంగా ఎంత దృఢంగా ఉన్నవారికైనా తట్టుకోవడం అంత సులభం కాదు. ఇది వారిని మానసికంగా కుంగదీసే ప్రమాదం లేకపోలేదన్నది మానసిక నిపుణుల అంచనా.
2025 ఫిబ్రవరి వరకు సునీతా విలియ మ్స్, విల్మోర్ రాలేకపోతే వాళ్ల ఆరోగ్య పరిస్థితిపైనే ప్రధానంగా ఆందోళన వ్యక్తమవు తున్నది. ఛాలెంజింగ్‌గా ఉండే వాతావర ణం, అన్నింటికన్నా ముఖ్యంగా అక్కడ వా రు ఎదుర్కొనే తీవ్ర సోలార్ రేడియేషన్ ప్రభావం నాసా శాస్త్రవేత్తలను ఆందోళన కు గురిచేస్తున్నది. కాగా, అంతరిక్షంలో చి క్కుకుపోయిన సునితా విలియమ్స్, విల్మో ర్‌ల గురించి రోజుకో వార్త వింటూ ఉ న్నా ం. కేవలం భారతీయుల్లోనేకాక యావత్ ప్రపంచ వ్యాప్తంగానూ వారి భవిష్యత్తు పై ఇప్పుడు ఆందోళన మొదలయ్యింది. నిన్న మొన్నటి వరకు ‘ఈ రోజు వస్తారు, రేపు వస్తారని’ భావించినా చివరికి వచ్చే ఏడా ది ఫిబ్రవరి వరకు ఆ అవకాశం లేనందున అందరిలోనూ ఆందోళన మొదలైంది.
అధిక రేడియేషన్ ప్రమాదం
భూమికి 400 కి.మీ. దూరంలో ఉన్న వారిరువురు చిక్కుకున్న స్పేస్ స్టేషన్ దగ్గర భూమిమీద కంటే సుమారు 30 రెట్లు అధిక రేడియేషన్ ఉంటుంది. అదే ఇప్పు డు ఆ ఇద్దరు వ్యోమగాముల ఆరోగ్యంలో ప్రధానంగా భయపెట్టే విషయమని యూ రోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతున్నది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఒక్క వారం రోజులపాటు రేడియేషన్‌కు ఎక్స్‌పోజ్ అయితే శరీరంపై పడే ప్రభావం భూమిపై ఏడాదిపాటు రేడియేషన్‌కు గురైన దానితో సమానం.
సాధారణంగా రిస్క్ ఆఫ్ రేడియేషన్‌ను మిల్లీ సివరట్స్‌లో కొలుస్తారు. అంటే, స్పేస్‌లో వారిపై పడే రేడియేషన్ ప్రభావం సుమారు 50 నుంచి 20 వేల మిల్లీ సివరట్స్ ఉంటుందని అంచనా. ఇంకా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అది 150 నుంచి 6,000 ఎక్స్‌రేలు తీయించుకోవడం వల్ల శరీరంపై పడే రేడియేషన్ ప్రభావంతో సమానం. మనిషి శరీరంపై ఆ స్థాయిలో రేడియేషన్ ఎఫెక్ట్ పడటం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీరంలోని కణజాలాలు దెబ్బతింటాయి. నాడీవ్యవస్థపైనా అధిక ప్రభావం చూపిస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలూ తలెత్తుతాయి. అలాగే, వ్యోమగాముల రోగ నిరోధక శక్తి దెబ్బ తింటుంది. రేడియేషన్ ప్రమాదంతో వారు జబ్బు పడొచ్చు. క్యాన్సర్‌కు కూడా దారి తీయవచ్చు. ప్రధానంగా దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది పలువురికి ఆందోళన కలిగిస్తున్నది.
మరో సవాలు ‘మైక్రో గ్రావిటీ’
మరో తీవ్ర ఆరోగ్య సమస్య ‘మైక్రో గ్రావిటీ’వల్ల వచ్చేది. భూమిమీది గురుత్వాకర్షణ శక్తి వేరు, అంతరిక్షంలో ఉండే గురుత్వాకర్షణ శక్తి వేరు. మనం వారిని స్పేస్‌లో ఉండగా చూస్తున్నప్పుడే స్పష్టంగా వారి స్థితి తెలిసిపోతుంది. ఎక్కువ కాలం అదే పరిస్థితిలో ఉంటే అది మనిషి శరీరంపై కచ్చితంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా శరీరంలోని ఎముకల్లో పటుత్వం తగ్గిపోతుంది. మజిల్స్ మాస్ కూడా తగ్గే ప్రమాదం ఉంది. సాధారణంగా వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నప్పుడు నెలకు కనీసం ఒక శాతం బోన్ మాస్ కోల్పోతూ ఉంటారు. ముఖ్యంగా హిప్స్ దగ్గర, బ్యాక్ బోన్ దగ్గర, అలాగే తొడ ఎముక దగ్గర ఇలా జరిగే ప్రమాదం ఉంది.
అక్కడ ఎంత ఎక్కువ కాలం ఉంటే ఈ రిస్క్ అంత పెరిగే ప్రమాదం ఉంటుందని నాసా చెబుతున్నది. ఒక్కోసారి ఇది శారీరక వైకల్యానికీ దారి తీసే అవకాశం ఉంది. అలాగే, మైక్రో గ్రావిటీ వల్ల ఫ్లూయిడ్స్ మన శరీరంలోని పైభాగాలకు చేరుకుంటాయి. అందుకే, ఆస్ట్రోనాట్స్ ముఖాలు కాస్త ఉబ్బినట్టు కనిపిస్తాయి. పైకి చేరిన ఈ ఫ్లూయిడ్స్‌వల్ల ఒక్కోసారి మాట తడబడటం, రుచి, వాసన కోల్పోయే ప్రమాదాలూ లేకపోలేదు. బాడీలోని ఫ్లూయిడ్స్ శరీరమంతా సరైన రీతిలో సరఫరా కాకపోతే కిడ్నీల్లో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వారికి అంతరిక్షంలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి వస్తే తట్టుకోవడం చాలా కష్టం కూడా.
ప్రస్తుతానికి క్షేమంగానే..
తాజాగా నాసా తెలిపిన వివరాల ప్రకారం సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లో క్షేమంగా వున్నారు. వారి వసతికి ఇబ్బంది ఏమీ లేదు. సునీత తనకున్న పూర్వ అనుభవం దృష్ట్యా ఐఎస్‌ఎస్ కొనసాగిస్తున్న ప్రయోగాలు, పరిశోధనలలో ఎంతో ధైర్యంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఇద్దరినీ తీసుకు వచ్చేందుకు రాకెట్ తయారీలో అనుభవమున్న ఎలన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన ‘క్రూడ్’ డ్రాగన్ అనే నాలుగు సీట్లున్న రాకెట్ వెళ్లనుంది. దీనిలో నలుగురికి బదులు ఇద్దరినే పంపి తిరుగు ప్రయాణంలో వారిరువురిని తెచ్చే విధంగా స్పేస్ ఎక్స్‌తో నాసా చర్చలు జరుపుతున్నది.
1998లో అంతర్జాతీయ స్పేస్ సెంటర్ పని ప్రారంభించి 2000 నాటికి పూర్తి చే యటంతో నాటి నుండి పరిశోధనలు ప్రా రంభమయ్యాయి. ప్రతి గంటకు ఒకసారి భూమిచుట్టూ తిరిగే ఈ కేంద్రం ఫుట్‌బాల్ స్టేడియం పరిమాణంలో ఉంటుంది. నిరంతరాయ పరిశోధనల్లో మునిగిన ఈ స్పేస్ సెంటర్ పాత బడిపోయి, అంతరిక్షంలో చెత్తలా తేలియాడుతూ, భవిష్యత్‌లో వ్యోమనౌకలకు అడ్డు రాకుండా ఉండటానికిగాను దాన్ని కూల్చివేసేందుకు నాసా రూ. 7,036 కోట్ల కాంట్రాక్టును రాకెట్ తయారీ రంగంలో ప్రసిద్ధి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీకి అప్పగించింది.
అంతరిక్షంలో 400 కి.మీ. ఎత్తులో 430 టన్నుల బరువున్న ఈఐఎస్‌ఎస్ 2030 వరకు పని చేస్తుందని అంచనా ఉన్నప్పటికీ ముందుగానే అంటే ఫిబ్రవరి 2025లో ఫసిఫిక్ మహాసముద్రంలోని పాయింట్ నెమో అనే నిర్మానుష్య ప్రాంతంలో క్రూడ్ డ్రాగన్ రాకెట్‌తో కూల్చేస్తారు. ఆ రాకెట్ తీసుకెళ్లిన వ్యోమనౌకలోనే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను భూమిమీదకు తెచ్చే ఏర్పాట్లు ఇప్పటి వరకు అందిన చర్చలనుబట్టి తేలింది. ఒకవేళ సునీత తనతో ఐఎస్‌ఎస్ సెంటర్‌కు తీసుకెళ్లిన వినాయక స్వామి విగ్రహం కరుణించి నాసా చేస్తున్న మరమ్మతులు సఫలమై ‘స్టార్ లైనర్’ బాగుపడి ఇంకా ముందుగానే రావాలని ఆశిద్దాం. కాదు....కాదు ప్రార్థ్ధిద్దాం!
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
సెల్: 9491545699