21-09-2025 12:44:45 AM
-శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో విజయం
-హాఫ్ సెంచరీలు చేసిన హసన్, హ్రిదోయ్
దుబాయ్, సెప్టెంబర్ 20: ఆసియా కప్ సూపర్ పోరులో బంగ్లా బోణీ కొట్టింది. బంగ్లాదేశ్ శనివారం శ్రీలంకను 4 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్ శ్రీలంకను 168 పరుగులకే కట్టడి చేసింది. 169 పరుగుల లక్ష ఛేదనతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఇంకో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ హసన్ (61), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్రిదోయ్ (58) అర్ధ సెంచరీలతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
శనివారం మ్యాచ్‌లో తొలి నుంచే శ్రీలంకకు ఏదీ కలిసి రాలేదు. తొలుత టాస్ ఓడిన లంక జట్టు బ్యాటింగ్‌కు దిగగా.. ఓపెనర్లు నిస్సాంక (22), మెండిస్ (34) పవర్ ప్లేలోనే వెనుదిరిగారు. తర్వాత వచ్చిన హిట్టర్ కమిల్ మిశ్రా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. సీనియర్ ఆల్‌రౌండర్ దసున్ శనక (64*) బ్యాట్ ఝలిపించడంతో శ్రీలంక ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆదివారం భారత్ మధ్య పోరు జరగనుంది.