13-09-2025 05:27:45 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన లోక అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ నేటి కాలంలో తల్లిదండ్రులను తమ పిల్లలు భారంగా భావిస్తున్నారని ఆస్తులు పంచుకుంటున్నారే తప్ప వారి యొక్క పోషణను సంరక్షణను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
వృద్ధాప్యంలో తల్లిదండ్రులు వారి ఆర్థిక పరిస్థితి బాగోలేక మనోవర్తికై కోర్టును ఆశ్రయిస్తున్నారని చాలా కేసులు తమ దృష్టికి వచ్చాయని వృద్ధాప్యంలో తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం కచ్చిదారులు చెణికావేశంలో పెట్టుకున్న పోలీస్ కేసులు రాజీ పడదగిన, మనోవర్తి, గృహహింస, చెక్ బౌన్స్, ప్రాంసరీ నోట్, ఇతర కేసులు ఇరు వర్గాలు కోర్టుకు వచ్చి రాజీకి కుదిరించినట్లైతే ఇరువర్గాలు గెలిచినట్లే అవుతుందన్నారు. గ్రామస్థాయిలో పెద్దమనుషుల సమక్షంలో ర్యాలీ చేసుకున్న కేసులలో వారి అగ్రిమెంట్లకు చట్టబద్ధత ఉండదని కోర్టు కొచ్చి రాజీ కుదిరించుకున్నట్లయితే ఎంతో విలువైన కాలాన్ని డబ్బును ఆదా చేసుకోవచ్చని చట్టబద్ధత కూడా ఉంటుందన్నారు.
కచ్చిదారులు పంతాలకు పోకుండా లోక్ అదాలతో సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఇల్లందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జి చేతుల మీదుగా కక్షిదారులకు పులిహోర ప్యాకెట్లు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాంపల్లి ఉమామహేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తిక్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ టి. ఇందిర సీనియర్ న్యాయవాదులు ఎస్ వెంకట నరసయ్య, కొండ నారాయణ, ఎస్ వెంకటేశ్వర్లు, డీఎస్పీ చంద్ర భాను, సిఐ సురేష్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పొద్దుటూరి నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.