13-09-2025 05:28:57 PM
ఎమ్మెల్యే వీరేశం..
నకిరేకల్ (విజయక్రాంతి): కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మనుగడ ప్రమాదంలో పడిందని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) పేర్కొన్నారు. శనివారం స్థానిక కమల్ గార్డెన్స్ లో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో గురుపూజోత్సవ పురస్కారం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రైవేటు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆలోచనలో మార్పులు వస్తున్నాయని, ఆ మార్పుల ఫలితంగా విద్యా వ్యవస్థ మనుగడ ప్రమాదంలో పడిందన్నారు. ఆ పోటీని తట్టుకునే విధంగా యాజమాన్యాలు నిలబడాలని, వారికి ఉపాధ్యాయులు అండగా ఉండాలన్నారు.
ప్రైవేటు ఉపాధ్యాయులు తమకున్న సమస్యలను యాజమాన్యాలతో అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించే విధంగా ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ట్రస్మా అధ్యక్షుడు ఎర్ర శంభు లింగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చౌగొని రజిత శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి మాద యాదగిరి, ఎంఈఓ మేక నాగయ్య వివిధ పాఠశాలల యాజమాన్యం మారుపాక నరసయ్య, బి. కన్నయ్య గౌడ్, సిహెచ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.