01-12-2025 07:10:15 PM
న్యూఢిల్లీ: డిజిటల్ అరెస్టులపై దేశమంతా ఒకే తరహా దర్యాప్తు ఉండాలని, డిజిటల్ అరెస్టులకు సంబంధించిన కేసుల సంఖ్య పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా ఈ కేసులను ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టులకు సంబంధించిన కేసుల సంఖ్య వేగంగా పెరిగిందని, చాలా ఆందోళనకరమైనదని కోర్టు తెలిపింది. అవినీతి నిరోధక చట్టం (PCA) కింద లింక్డ్ బ్యాంక్ ఖాతాలు తెరిచినప్పుడు బ్యాంకర్ల పాత్రపై దర్యాప్తు చేయడానికి సీబీఐకి స్వేచ్ఛ ఇవ్వబడిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వెల్లడించారు.
డిజిటల్ అరెస్టుల పెరుగుతున్న సంఘటనలపై సుమోటోగా విచారణ చేపట్టిన కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ను ఒక పార్టీగా చేరుస్తూ సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ విషయంలో కోర్టుకు సహాయం చేయాలని సుప్రీంకోర్టు ఆర్బీఐని కోరింది. అటువంటి ఖాతాలను గుర్తించడానికి, అటువంటి నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్తంభింపజేయడానికి ఏఐ- ఆధారిత మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను ఎందుకు వాడట్లేదని కోర్టు ఆర్‌బిఐని ప్రశ్నించింది.
ఐటీ ఇంటర్మీడియరీ రూల్స్ 2021 ప్రకారం, ఈ విషయంలో అన్ని విభాగ అధికారులు సీబీఐకి పూర్తి సహాయం అందిస్తారని కోర్టు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో సీబీఐతో ఇంకా సహకరించని రాష్ట్రాలు వెంటనే సహకరించాలని, తద్వారా దర్యాప్తు పెద్ద ఎత్తున నిర్వహించవచ్చని కోర్టు ఆదేశించింది. అవసరమైతే సీబీఐ ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటుందని, సిమ్ కార్డు దుర్వినియోగదారులను నిశితంగా పరిశీలించాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు సుప్రీంకోర్టు సూచించింది.