24 June, 2026 | 2:31 AM

పోలీస్, వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు

24-06-2026 01:11 AM

గుండాల, జూన్ 23 (విజయక్రాంతి): జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ రోహిత్ రాజు ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రయాలను కట్టడి చేస్తూ, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందేలా చూడడం కోసం  పోలీస్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని పలు ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని గుండాల ఎస్త్స్ర శ్రావణ్, సీఐ తిరుపతి, వ్యవసాయ శాఖ ఏవో వెంకటరమణ తెలిపారు.

విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలు, లైసెన్సులు, బిల్లుల నిర్వహణ, నిల్వలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు విక్రయిస్తున్న విత్తనాలు, ఎరువులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని తనిఖీ చేశారు. ప్యాకెట్లపై ఉన్న వివరాలు, తయారీ తేదీలు, గడువు తేదీలు, కంపెనీ గుర్తింపు తదితర అంశాలను పరిశీలించారు. రైతులను మోసం చేసే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదన్నారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నాసిరకం పురుగు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే కేసులు నమోదు చేసి, పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతులు వ్యవసాయ సీజన్ ప్రారంభంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు.