calender_icon.png 13 December, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడుగడుగునా నిఘా

13-12-2025 12:10:07 AM

  1.   450 సీసీ కెమెరాలు, ఆక్టోపస్, వజ్ర వాహనాలతో పహారా
  2.   2,500 మందితో హై సెక్యూరిటీ
  3. రాచకొండ సీపీ సుధీర్‌బాబు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో శనివారం జరుగనున్న మెగా ఈవెంట్ కోసం రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గేట్ నం. 1 కేవలం ఆటగాళ్లు, వీవీఐపీలకు మాత్రమే కేటాయించారు. ప్రేక్షకుల కు టికెట్ ఉన్న ఇతర గేట్ల ద్వారా అనుమతిస్తారు. మ్యాచ్ షెడ్యూల్ కంటే 3 గంటల ముందే ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తారు. శుక్రవారం జరిగిన మీడియా సమా వేశంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు బం దోబస్తు వివరాలను వెల్లడించారు.

‘ప్రేక్షకులు, వీఐపీల భద్రత కోసం దాదాపు 2500 మంది పోలీసులను మోహరించాం. ఇందులో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టీఎస్‌ఎస్పీ, ఏఆర్, ఆక్టోపస్, మౌంటెడ్ పోలీస్, వజ్ర వాహనాలతో పాటు స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్, ఎస్‌ఓటీ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయి’ అని తెలిపారు. బాంబ్ డిస్పోజల్ టీమ్స్, స్నిఫర్ డాగ్స్ ద్వారా స్టేడియం లోపల, బయట అణువణువూ తనిఖీ చేస్తున్నామన్నారు.

450 కెమెరాలతో డేగ కన్ను

స్టేడియం పరిసరాలు, పార్కింగ్ ప్రాంతా లు, చెక్ పాయింట్ల వద్ద మొత్తం 450 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి కదలికను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. 

క్యూఆర్ కోడ్ మస్ట్

టికెట్లు సాఫ్ట్ కాపీల్లోనే ఉంటాయని, మొబైల్ ఫోన్‌లోని డిస్ట్రిక్ట్ యాప్‌లో జనరేట్ అయిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారానే ఎంట్రీ ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. జిరాక్స్ కాపీలు, స్క్రీన్ షాట్లు అనుమతించబోమని, అనధికారికంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, వాటర్ బాటి ళ్లు, బ్యాగులు, హెల్మెట్లు, బైనాక్యులర్స్, సిగరెట్లు, లైటర్లు, అగ్గిపెట్టెలతో పాటు బయటి ఆహార పదార్థాలను స్టేడియం లోపలికి అనుమతించరు. ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేకంగా షీ టీంలను, బ్లాక్ టికెట్ల దందాపై నిఘా ఉంచేందుకు స్పెషల్ టీంలను రంగంలోకి దించినట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్సుల సంఖ్యను ఐదుకు పెంచామన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు పాటించాలన్నారు.