calender_icon.png 13 December, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు హైదరాబాద్ రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం

13-12-2025 01:03:29 AM

సీఎం రేవంత్‌తో మ్యాచ్ 

హాజరుకానున్న రాహుల్‌గాంధీ, పలువురు ప్రముఖులు

అర్జెంటీనా స్టార్‌ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్న ఫ్యాన్స్

ప్రస్తుతం భారత్ మెస్సీ ఫీవర్‌తో ఊగిపోతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వస్తున్నాడు. శనివారం నుంచి నాలుగు ప్రధాన నగరాల్లో సందడి చేయబోతున్నాడు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కోల్‌కతాలో గడపనున్న ఈ సాకర్ సూపర్ స్టార్ సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నాడు. ఎయిర్‌పోర్టు నుంచి గ్రీన్ ఛానల్ మార్గం ద్వారా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరవుతాడు.

రూ.10 లక్షలు చెల్లించిన అభిమానులతో ఫొటోలు దిగి ఆటోగ్రాఫ్ ఇవ్వనున్నాడు. అనంతరం ఉప్పల్ స్టేడియానికి రానున్న మెస్సీ చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ క్లీనిక్‌లో పాల్గొని వారికి ఆటలో మెళకువలు నేర్పిస్తాడు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి టీమ్‌తో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నాడు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మెస్సీ మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు.

మెస్సీతో పాటు మరో ఇద్ద రు స్టార్ ప్లేయర్స్ రోడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్‌లో పాల్గొంటారు. అనంతరం గెలిచిన టీమ్‌కు మెస్సీ, సీఎం రేవంత్ కలిసి గోట్ ట్రోఫీని అందజేస్తారు. ఇదిలా ఉంటే మెస్సీ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. సా.4 గంటలకు హైదరాబాద్ రానున్న మెస్సీ దాదాపు ఐదు గంటల పాటు ఈ కార్యక్రమాలతో బిజీగా గడపనున్నాడు. రాత్రికి ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనే బస చేసి ఆదివారం ఉదయం ముంబైకి బయలురేది వెళతాడు.

మెస్సీ టూర్ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మెస్సీకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నామని, స్టేడియం దగ్గర అభిమానులు సహకరించాలని కోరారు. టికెట్ ఉన్నవారు మాత్రమే స్టేడియానికి రావాలని సూచించారు. ఆదివారం ముంబైలోనే గడపనున్న మెస్సీ చివరి రోజు న్యూఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ కానున్నాడు.

మంత్రనగరిలో మెస్సీ

అతడి పేరు వింటే చాలు సాకర్ ప్రపంచం పూనకాలతో ఊగిపోతుంది. అతడి ఆట ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు లక్షల్లో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇతడిని అభిమానిస్తుంటారు. అతడి ఆట అలా ఉంటుంది మరి. అతనెవరో కాదు అర్జెంటీనా సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ..  ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆడుతున్నవారే కాక.. ఆల్ టైంలో చూసినా.. ఫుట్‌బాల్ దిగ్గజాల్లో సైతం ఇతడి పేరు ముందువరుసలోనే ఉంటుంది. మైదానంలో చిరుతలా కదులుతూ గోల్స్ చేస్తుంటాడు. దిగ్గజాలకే దిగ్గజంగానూ పేరుగాంచాడు. అలాంటి ఆటగాడు 14 ఏళ్ల తర్వాత భారత్‌కు వస్తున్నాడు. ఈ సాకర్ సూపర్ స్టార్‌ను చూసేందుకు యావత్ భారత్ ఫుట్‌బాల్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

మన దేశంలో క్రికెట్ కే క్రేజ్ ఎక్కువ... మిగిలిన ఏ క్రీడలూ కూడా క్రికెట్ తో పోలిస్తే అభిమానులు తక్కువే.. కానీ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్ మాత్రం ఫుట్ బాలే... ఎందుకంటే 200 దేశాల్లో సాకర్ ను ఆడుతుంటారు. క్రికెట్ ఆడే వేరే దేశాల్లోనూ ఫుట్ బాల్ కు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అర్జెంటీనా, బ్రెజిల్ , ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్,  పోర్చుగల్, నెదర్లాండ్స్.. ఇలా ఏ దేశంలో చూసినా సాకర్ క్రేజ్ మామూలుగా ఉండదు.

అందుకే ఫుట్ బాల్ లో స్టార్ ప్లేయర్స్ ఆయా దేశాల నుంచే వస్తుంటారు. ఇదే కోవలోకి వస్తాడు అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ...అరంగేట్రం నుంచే సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన లియోనల్ మెస్సీ.. 1987 జూన్ 24న అర్జెంటీనా రోసారీలో జన్మించాడు. దేశ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఆడుతున్నప్పటికీ.. స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాతోనే ఎక్కువ ప్రాచుర్యం పొందాడు. ఆ క్లబ్‌తో అతడికి విడదీయరాని అనుబంధం ఉంది.  2003లో తొలిసారి బార్సిలోనా క్లబ్ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పుడతని వయసు 17 ఏళ్లే.

ఫుట్‌బాల్ ఆడొద్దన్నారు..  కట్ చేస్తే

5 అడుగుల తొమ్మిది అంగుళాలు.. మొహంపై ఎప్పటికీ చెరగని చిరునవ్వు.. 20 ఏళ్లుగా తన ఆటతో అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. మారడోనా తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ అభిమానులకు అతడు ఆరాధ్య దైవం. ఆయనే గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‌టైమ్ (GOAT), స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ. లెక్కలేనన్ని అవార్డులు, లెక్కకు మించి ట్రోఫీలు, ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్‌తో పాటు మినీ వరల్డ్ కప్‌గా భావించే కోపా అమెరికా కప్‌ను అర్జెంటీనాకు అందించడంలోనూ మెస్సీ పాత్ర కీలకం.

అలాంటి మెస్సీ నేడు హైదరాబాద్‌లో అడుగుపెడుతున్నాడంటే ఆ సందడి మాములుగా ఉండదు కదా మరి!. కానీ 11 ఏళ్ల వయసులో హార్మోన్ గ్రోత్ లోపంతో బాధపడ్డ మెస్సీని వైద్యులు ఫుట్‌బాల్ ఆడొద్దని హెచ్చరించారు. కానీ పట్టు వదలని విక్రమార్కుడి లాగా తన లోపాన్ని అధిగమించిన మెస్సీ ఇవాళ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడిగా నిలిచి చరిత్ర సృష్టించాడు. అతని బాల్యం ఒకసారి పరిశీలించి చూస్తే.. 

లియోనల్ మెస్సీ.. 1987, జూన్ 24న శాంటా ఫే ఫ్రావిన్స్‌లోని రోసారియోలో జన్మించాడు. స్థానిక స్టీల్ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జార్జ్ మెస్సీ, సెలియా కుసిట్టిని దంపతులకు మూడో సంతానం. తండ్రి స్వతహాగా ఫుట్‌బాల్ ఆటగాడు కావడంతో మెస్సీకి చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్ ఆటపై మక్కువ పెంచుకున్నాడు. నాలుగేళ్ల వయసు నుంచే ఫుట్‌బాల్ ఆడడం మొదలుపెట్టిన మెస్సీకి తండ్రి జార్జ్ మెస్సీ తొలి కోచ్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత అప్పటికే ఫుట్‌బాల్ ఆటలో పేరు సంపాదించిన తన సోదరులు రోడ్రిగో, మాటియాస్‌లు.. మెస్సీకి  ఆటకు సంబంధించిన మెళుకువలు నేర్పించారు. కానీ 11వ ఏట మెస్సీ జీవితంలో రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి తన అమ్మమ్మ సెలియా మరణం.. రెండోది గ్రోత్ హార్మోన్ లోపం బయటపడడం.

అంతుచిక్కని వ్యాధి..

మెస్సీకి 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు .. గ్రోత్ హార్మోన్ లోపం (GHD) ఉన్నట్లు నిర్థారణ అయింది. దీంతో మెస్సీ జీవితంలో ఫుట్‌బాల్ ఆటగాడు కాలేడని వైద్యులు ప్రకటించారు. అయితే మెస్సీకి చికిత్స చేయించేందుకు అప్పట్లోనే నెలకు 900 డాలర్లు ఖర్చు అయ్యేది. మెస్సీ కుటుంబం ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో అతని చికిత్సకు డబ్బులు సర్దుబాటు కాక కష్టంగా మారిపోయింది. దీంతో మెస్సీ తండ్రితో ఉన్న అనుబంధం బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ సాయపడేలా చేసింది. ఈ నేపథ్యంలోనే మెస్సీ కుటుంబానికి అండగా నిలబడిన బార్సిలోనా చికిత్స మొత్తం ఖర్చును భరించింది. అలా 11 ఏళ్ల వయసులోనే మెస్సీ బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌కు రుణ పడిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 

గోల్స్‌లో తిరుగే లేదు

యూరో లీగ్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆట

గాడికిచ్చే గోల్డెన్ షూను కూడా ఆరుసార్లు పొందిన ఏకైక ఆటగాడు మెస్సీనే. 2012లో లా లిగా ఫుట్‌బాల్ లీగ్‌లో 59, ఛాంపియన్స్ లీగ్‌లో 13, జాతీయ జట్టు తరఫున 12, ఇతర టోర్నీల్లో 7 ఇలా మొత్తం 91 గోల్స్ చేశాడు.ఒక క్లబ్ తరఫున ఎక్కువ గోల్స్ చేసింది మెస్సీనే. బార్సిలోనాకు ఆడుతూ.. ఇప్పటివరకు 672 గోల్స్ చేశాడు. బ్రెజిల్ లెజెండ్ పీలేనే అధిగమించాడు. చిన్న వయసులో తొలి గోల్, 100వ గోల్, 200వ గోల్ చేసింది మెస్సీనే. ఇదిలా ఉంటే అర్జెంటీనాకు ప్రపంచకప్ కల నెరవేర్చిన ఘనత అతనికే దక్కుతుంది. 

9 ఏళ్లకే లవ్‌స్టోరీ..

మెస్సీ జీవితంలో తన భార్య ఆంటోనెల్లా రొకుజ్జో పాత్ర కూడా చాలా కీలకం. మెస్సీ 9 ఏళ్ల వయసులోనే వీరి ప్రేమకథ మొదలవ్వడం విశేషం. రొసారియో వీధుల్లో చిగురించిన ప్రేమ ఆ తర్వాత వివాహ బంధానికి దారి తీసింది. అయితే ఈ దారిలో ఈ జంటకు ఆటంకాలు చాలానే ఎదురయ్యాయి. మెస్సీ స్నేహితుడు లూకాస్ స్కాలియాకు ఆంటోనెల్లా కజిన్ (వరుసకు సోదరి) అవుతుంది. లూకాస్ ఇంటికి వెళ్లినప్పుడు మొదటిసారి మెస్సీ 8 ఏళ్ల ఆంటోనెల్లాను చూశాడు.

సిగ్గుపడే స్వభావం కలిగిన మెస్సీ ఆమెను నేరుగా పలకరించలేకపోయాడు.  ‘ఏదో ఒక రోజు నిన్ను నా గర్ల్‌ఫ్రెండ్‌గా చేసుకుంటాను’ అని మెస్సీ రాసిన లేఖ ఆంటోనెల్లా కళ్లలో పడింది. అలా వీరిద్దరి మధ్య స్నేహం మొదలైంది. అయితే మెస్సీకి ‘గ్రోత్ హార్మోన్ లోపం’ తేలడంతో చికిత్స కోసం అతని కుటుంబం బార్సిలోనాకు వెళ్లిపోయింది. దీంతో మెస్సీ తన ప్రియురాలు ఆంటోనెల్లాకు దూరమయ్యాడు. ఒకవైపు మెస్సీ ఫుట్‌బాల్‌లో రాణిస్తుండగా, మరోవైపు ఆంటోనెల్లా తన చదువులో బిజీ అయ్యింది.

కొంతకాలం పాటు వారి మధ్య మాటలు కూడా తగ్గిపోయాయి. ఒక విషాదం మళ్లీ వారిద్దరిని ఒకటి చేసింది. 2005లో ఆంటోనెల్లా ప్రాణస్నేహితురాలు ఒక రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ వార్త తెలిసి ఆంటోనెల్లా తీవ్ర మనోవేదనకు గురైంది. ఆమె పక్కన నిలిచి ధైర్యం చెప్పాడు. ఆ క్షణమే ఆంటోనెల్లాకు అర్థమైంది.. తన జీవితానికి సరైన జోడి మెస్సీనే అని. అప్పటి నుంచి వారి బంధం మరింత బలపడింది. తమ ప్రేమ చిగురింపుకు కారణమైన రొసారియోలోనే ప్రముఖులు, కుటుంబసభ్యుల సమక్షంలో 2017లో మెస్సీ, ఆంటోనెల్లా ఒకటయ్యారు. 

సంపాదనలో టాప్

ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల్లో మెస్సీ అందరికంటే ముందున్నాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల కంటే క్లబ్ ఫుట్‌బాల్ ద్వారా అతడు ఎక్కువ సంపాదిస్తాడు. ఇంకా ఎండోర్స్‌మెంట్స్‌కు లెక్కే లేదు. దిగ్గజ బ్రాండ్లు ఇతడి కోసం ఎగబడుతుంటాయి. వీటి ద్వారా కోట్లల్లో సంపాదిస్తున్నాడు. అతని నికర ఆస్తుల విలువ ఏడు వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. మెస్సీ ఏడాదికి రూ.1100 కోట్ల వరకూ ఆర్జిస్తున్నాడు. ఇక పర్సనల్ వైఫ్ గురించి చూస్తే మెస్సీ కుటుంబం విషయానికి వస్తే తన చిన్ననాటి స్నేహితురాలు అంటోనెలా రొకెజ్జాను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. కాగా మెస్సీ భారత్ టూర్ కు వస్తుండడంతో సాకర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం అతన్ని చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

రికార్డులు.. రివార్డులు..

ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నాలుగు అవార్డులు బాలన్ డీ ఓర్, ఫిఫా వరల్డ్ ప్లేయర్, పిచిచీ ట్రోఫీ, గోల్డెన్ బూట్  అందుకున్న ఏకైక ఆటగాడు మెస్సీనే. 2009-10 సీజన్‌లో ఇది సాధించాడు. అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడికి ఇచ్చే బాలన్ డీ ఓర్‌ను అవార్డును ఏకంగా ఆరుసార్లు అందుకున్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 2009,10,11,12,15,19లలో దీనిని సొంతం చేసుకున్నాడు. 

మెస్సీ X రొనాల్డో.. ఎవరు గొప్ప?

గత రెండు దశాబ్దాల్లో ఆట పరంగా, క్రేజ్ పరంగా చూస్తే మెస్సీ, రొనాల్డోకు సాటి వచ్చే ఆటగాళ్ళు మరెవరూ కనిపించరు. చాలా మంది యువ సంచలనాలు దూసుకొచ్చినా వీరిద్దరి స్థాయిని అందుకోలేకపోయారు. అయితే మెస్సీ, రొనాల్డో ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న చర్చ చాలా కాలంగా సాగింది. ఎందుకంటే ఆదాయం, ఆట, రికార్డులు ఇలా చాలా అంశాల్లో వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్టు ఉండేవారు. అయితే ఈ చర్చకు రెండేళ్ల క్రితం దాదాపుగా తెరపడింది. ఫుట్‌బాల్ ప్లేయర్స్‌కు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక బాలెన్ డోర్ పురస్కారాన్ని మెస్సీ ఏకంగా 8సార్లు కైవసం చేసుకున్నాడు. సాకర్ ప్లేయర్ నైపుణ్యానికి ఈ అవార్డును కొలమానంగా భావిస్తారు. అలాంటి అవార్డును అత్యధికంగా అందుకున్న మెస్సీనే బెస్ట్‌గా చెబుతారు.

మీట్ అండ్ గ్రీట్.. ఫుట్‌బాల్ క్లినిక్... 

ఫ్రెండ్లీ మ్యాచ్..

హైదరాబాద్‌లో మెస్సీ షెడ్యూల్ ఇదే

మెస్సీ గోట్ టూర్‌తో భారత్ సాకర్ అభిమానుల్లో సరికొత్త జోష్ నెలకొంది. కేరళలోని తిరువనంతపురం ఈవెంట్ రద్దు కావడంతో హైదరాబాద్‌కు ఆ అవకాశం దక్కింది. మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడిని నగరానికి తీసుకురావడం వెనుక చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా అతని రాకతో తెలంగాణలో సాకర్‌కు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఒకప్పుడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ వంటి దిగ్గజాలను భారత ఫుట్‌బాల్‌కు అందించిన హైదరాబాద్‌లో సాకర్‌కు మునుపటి వైభవం వచ్చేందుకు ఇది మరో అడుగుగా భావిస్తున్నారు.

ఇలాగే  రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా దిగ్గజ కార్పొరేట్ సంస్థలను ఆకర్షించిన తెలంగాణ ప్రభుత్వం మెస్సీ ఈవెంట్‌తో టూరిజం పరంగానూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం గత కొన్నిరోజులుగా సీఎం రేవంత్‌రెడ్డి సైతం సీరియస్‌గా ప్రాక్టీస్ చేయడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. స్వతాహాగా ఫుట్‌బాల్ అభిమాని అయిన సీఎం రేవంత్‌రెడ్డి మెస్సీ లాంటి దిగ్గజంతో మ్యాచ్ ఆడబోతుండడం హైలెట్‌గా నిలుస్తోంది.

మూడురోజుల టూర్‌లో భాగంగా హైదరాబాద్‌కు రానున్న మెస్సీ బిజీబిజీగా గడపబోతున్నాడు. ఐదు గంటల పాటు పబ్లిక్ అప్పీరెన్స్‌లో ఉంటాడు. కోల్‌కతాలో మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటాడు. గ్రీన్ ఛానల్ మార్గం ద్వారా నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి అక్కడ అభిమానులతో మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొంటాడు. రూ.10 లక్షల చొప్పున చెల్లించి టికెట్ తీసుకున్న వారికే ఈ కార్యక్రమంలో అవకాశం కల్పిస్తారు.

తర్వాత ఉప్పల్ స్టేడియానికి వెళ్లి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ క్లినిక్‌ను సందర్శించనున్నాడు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి టీంతో కలిసి ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడతాడు. ఈ మ్యాచ్ 20 నిమిషాల పాటు ఉన్నప్పటకీ... మెస్సీ, సీఎం రేవంత్ చివరి 5 నిమిషాల్లోనే గ్రౌండ్‌లోకి వస్తారు. మ్యాచ్ ముగిసిన తర్వాత గెలిచిన జట్టుకు మెస్సీ, సీఎం రేవంత్ గోట్ ట్రోఫీని అందజేయనున్నారు. ఈవెంట్ ముగిసిన తర్వాత ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తాడు.

మరుసటి రోజు ఉదయం ముంబైకి బయలుదేరి వెళతాడు. ఇదిలా ఉంటే ఎక్కువమంది అభిమానులకు ఈ కార్యక్రమం చూసే అవకాశం కల్పించేందుకు 38 వేల కెపాసిటీ ఉన్న ఉప్పల్ స్టేడియాన్ని ఎంచుకున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఈవెంట్ కోసం 3500 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. టికెట్లు ఉన్నవారు మాత్రమే స్టేడియానికి రావాలని కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఉపయోగించుకోవాలని సూచించారు.