13-12-2025 12:12:18 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరాన్ని పట్టిపీడిస్తున్న మత్తు మహమ్మారిని సమూలంగా ఏరిపారేసేందుకు పోలీసులు కొరడా ఝుళిపించారు. డ్రగ్స్ విక్రయించే వారి పట్ల ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లపై ఎటువంటి నిఘా ఉంచుతామో.. ఇకపై డ్రగ్స్ నేరగాళ్లు, పెడ్లర్లపైనా అదే స్థాయి నిఘా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీపీ సజ్జనార్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీకి ఐబీ, డీఆర్‌ఐ, ఎన్సీబీ, ఎక్సుజ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఈగల్, ఎఫ్‌ఆర్‌ఆర్వో తదితర కేంద్ర, రాష్ర్ట ఏజెన్సీల అధికారులు హాజరయ్యారు. డ్రగ్స్ నిర్మూలన ఒక్కరోజుతో అయిపోయేది కాదని, ఇది నిరంతర పోరాటమని, అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలని సీపీ పిలుపునిచ్చారు.
ప్రతినెలా ఈ ఏజెన్సీలతో సమీక్ష ఉంటుందని తెలిపారు. నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు కీలకమైన హైదరా బాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను మరింత బలోపేతం చేస్తున్నట్లు సీపీ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న టీమ్స్కు అదనంగా మరో నాలుగైదు కొత్త బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే డ్రగ్స్ రవాణాలో విదేశీయుల పాత్రపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. విమానాశ్ర యాల్లో ప్రయాణికుల డేటా ఆధారం గా అనుమానితులపై నిఘా పెట్టాలి.
వైద్యం కోసం నగరానికి వచ్చి, ఆస్పత్రుల్లో చేరకుండా బయట తిరుగుతున్న విదేశీయుల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలి. డీఆర్‌ఐ, ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ అధికారుల సహకారంతో వారిని ట్రాక్ చేయాలి. ఇటీవల డ్రగ్స్ రవాణాకు కొరియర్ సర్వీసులు వేదికగా మారుతున్నాయని, వాటిపైనా ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐబీ జాయింట్ డైరెక్టర్ తిరుగణన సంబంధన్, ఈగల్ టీమ్ డీఐజీ అభిషేక్ మహంతి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.