calender_icon.png 11 January, 2026 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపీయం విక్రయిస్తున్న నిందితుడి అరెస్టు

11-01-2026 01:15:42 AM

చిట్యాల పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ఘటన 

మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం: నల్లగొండ డీఎస్పీ

చిట్యాల, జనవరి 10 (విజయక్రాంతి): అక్రమంగా ఓపీయం పాపి హస్క్ అనే మాదకద్రవ్యాన్ని లారీ డ్రైవర్లకు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ కే శివరాం రెడ్డి తెలిపారు. శనివారం చిట్యాల పట్టణ కేంద్రంలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులో జాతీయ రహదారి 65పై ఉన్న డూన్ పంజాబీ దాబాలో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన దాబా యజమాని గుర్నిత్ సింగ్ కొంతకాలంగా నిషేధిత మాదక ద్రవ్యమైన ఓపీయం పాపి హస్క్‌ని దాబాలోని కస్టమర్లకు విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి దాబాపై దాడిచేసి గుర్నిత్ సింగ్‌ను విచారించారు.

లారీడ్రైవర్ల నుంచి తాను ఓపీయం పాపి హస్కును ఒక్క కిలో 1800 రూపాయలకు కొనుగోలు చేసి దానిని తిరిగి కిలో 6000 చొప్పున వాహనదారులకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. కొద్దిరోజుల క్రితం 10కిలోల ఓపీయం పాపి హస్క్ కొనుగోలు చేసి అందులో సుమారు ఒక కిలో కస్టమర్లకు విక్రయించి మిగిలిన 9 కిలోలను దాచి పెట్టినట్లు తెలిపారు. దాబా యజమాని నుంచి రూ.54 వేల నగదు, 9 కిలోల ఓపీయం పాపి హస్క్, ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అక్రమ మాదకద్రవ్యాలను సరఫరా చేసిన అమ్మిన, వినియోగించిన ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.మాదక ద్రవ్యాల ఎవరైనా విక్రయిం చిన, సేవించిన 100 నెంబర్ కు గాని లేదా 8712670266 నెంబర్‌కు గాని సమాచారం అందించినట్లయితే వారి వివరాలు గోప్యం గా ఉంచుతామన్నారు. సమావేశంలో నార్కె ట్‌పల్లి సీఐ కే నాగరాజు, చిట్యాల, మునుగోలు ఎస్‌ఐలు మామిడి రవికుమార్, ఇరిగు రవి, సిబ్బంది పాల్గొన్నారు.