19-09-2025 07:51:58 PM
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): వంగమర్తి ఇసుక రీచ్ లో పూడిక ద్వారా తీసిన 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇండ్లు,ఇతర అభివృద్ధి పనులకు వినియోగించుకునేందుకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం తీర్మానించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.గత మే నెలలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో వంగమర్తి ముంపు ప్రాంతంలో సుమారు 8 లక్షలు ఇసుకను పూడిక తీత ద్వారా తీసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు వినియోగించుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఈ ఇసుకను ఇప్పటివరకు వినియోగించుకోనందున దాన్ని సద్వినియోగం చేసుకునే విషయమై కమిటీ చర్చించి ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను రాష్ట్రంతో పాటు, జిల్లాలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునేలా నిర్ణయం తీసుకుంది. ఈ ఇసుకను టీజీ ఎండీసీకి బదలాయించడం ద్వారా టీజీఎండిసి నుండి ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇండ్లు, సాండ్ బజార్ కు కేటాయించేలా తీర్మానించారు. దీంతోపాటు జిల్లాలో మరో ఐదు ఇసుక రీచ్ ల ను గుర్తించి వాటి ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఇచ్చేందుకు సమావేశం చర్చించింది.
బ్రాహ్మణపల్లి తాండ, వావిల్ కోల్ రీచుల నుండి డిండి, చందంపేట, పెద్దవూర, పీఏ పల్లి, కొండమల్లేపల్లి మండలాలలోని ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరాకు తీర్మానించింది. కనగల్ మండలం ఎం. గౌరారం నుండి అనుముల, గుర్రంపోడు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, కనగల్ మండలాలలోని ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకనిచ్చేందుకు నిర్ణయించింది. వంగమర్తి, చిత్తలూరు మూసి ఎగువ ప్రాంతం నుండి తీసిన ఇసుకను కేతేపల్లి, కట్టంగూర్, నకిరేకల్, మండలాలలో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకనివ్వాలని నిర్ణయించారు.
తాటికల్ లో గత ఫిబ్రవరిలోనే ఏర్పాటుచేసిన ఇసుక రీచ్ నుండి తక్షణమే ఇసుకను సరఫరా చేసేందుకు రెవెన్యూ, పోలీస్, మైన్స్ శాఖ సహకారంతో ఇసుకను సరపరాలు చేసేందుకు గాను సమావేశం అంగీకరించింది. చిట్యాల లో ఉన్న ఇసుక కొరతను తీర్చేందుకు వెంటనే అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకునేలా సమావేశం ఆమోదించింది. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మైన్స్ ఏడి శామ్యూల్ జాకబ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్, టిజిఎండిసి అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.