29-12-2024 12:00:00 AM
సాంకేతికంగా దూసుకుపోతున్న నేటి యుగంలో టీ-సాట్ ఆధునిక టెక్నాలజీతో తెలంగాణలోని అన్నివర్గాలకు చేరువవడమే కాకుండా, ఒక వరంగా మారింది. ప్రస్తుత కాలంలో అన్ని అంశాలు సాంకేతికతతో ముడిపడి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు.. ఇలా అందరికీ టీ-సాట్ చేదోడుగా ఉంటుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో ఇంటింటికీ దగ్గరవుతుంది.
విద్యార్థులకు, యువతకు టీ-సాట్ ప్రత్యేకంగా అందిస్తున్న ‘విద్య’ కార్యక్రమాలు చేయూతలా మారాయి. పోటీ పరీక్షలకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని పేద విద్యార్థులకు టీ-సాట్ ప్రత్యేక యూట్యూబ్ ఛానళ్లు ప్రయోజకరంగా ఉన్నాయి. గ్రూప్-1,2,3 ఉద్యోగాలతో పాటు, డీఎస్సీ, టెట్, ఆర్‌ఆర్‌బి, బ్యాంకింగ్, కేంద్ర ప్రభుత్వ ఎస్‌ఎస్సీతో పలు పోటీ పరీక్షల కోసం విద్యార్థులందరికీ తోడ్పడేందుకు అనుభవమున్న ఫ్యాకల్టీచే రూపొందించిన కంటెంట్‌ను టీ-సాట్ అందించింది.
తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది కాలంలోనే గ్రూప్ పరీక్షలతో పాటు టెట్, బీఎడ్, డీఎడ్ పరీక్షలను కూడా పెద్ద ఎత్తున నిర్వహించడంతో టీ-సాట్ విద్యార్థులకు ప్రత్యేక కంటెంట్ అందించింది. టెట్ పరీక్ష కోసం 105 గంటలకు సంబంధించి 199 పాఠ్యాంశాలు, డీఎస్సీ క్రాష్ కోర్సు కోసం 613 గంటలకు సంబంధించి 50 ఎపిసోడ్స్‌లో నాణ్యమైన కంటెంట్ అందించింది.
జనరల్ స్టడీస్‌పై‘ జనరల్ స్టడీస్ ఫర్ ఆల్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని టీ-సాట్ ప్రసారం చేస్తుండడంతో పోటీ పరీక్షలకు వెళ్లే యువతకు ప్రయోజకరంగా ఉంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టపరచాలని కంకణం కట్టుకున్న టీ-సాట్ ఇంటింటికీ నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప లక్ష్యంతో తెలంగాణ ఉన్నత విద్యామండలితో ప్రత్యేక అవగాహన కదుర్చుకుని విద్యార్థు లకు పాఠ్యాంశాలు అందించడంలో సాయపడుతోంది.
3 నుండి 8వ తరగతి విద్యార్థుల కోసం 8 గంటల డిజిటల్ పాఠాలను ప్రసారం చేస్తోంది. ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రతిరోజు 11 ఎపిసోడ్ల డిజిటల్ పాఠాలను ప్రసారం చేస్తోంది. అన్ని విభాగాలకు అందుబా టులో ఉండేలా ‘స్ఫూర్తి’ కార్యక్రమం ద్వారా స్వాతంత్య్ర యోధులతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖుల జీవిత చరిత్రలతోపాటు అవార్డులు పొందిన ప్రముఖ వ్యక్తుల ప్రత్యేక ఇంటర్వ్యూలతో వారి అనుభవాలను అందుబాటులోకి తెస్త్తోంది.
వివిధ భాషలపై యువత నైపుణ్యం పెంచుకునేందుకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలపై ప్రత్యేక కార్యక్రమాలతో వీడియోలను రూపొందిం చి అందుబాటులోకి తెచ్చిం ది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రారంభించిన టీ-సాట్ నెట్‌వర్క్, సోషల్ మీడియా ద్వారా 22 వేలకు పైగా ప్రజలకు ఉపయోగకర వీడియోలను అందుబాటులోకి తేవడంతో లక్షకు పైగా వ్యూస్, 8 లక్షలకు పైగా సబ్‌స్రైబర్స్ ఆదరణ పొందుతోంది.
గత ఏడాది కాలంలో ప్రభుత్వం టీ-సాట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సీఈఓ వేణుగోపాల్ రెడ్డి సంస్థలో పెద్దఎత్తున మార్పులు తీసుకొని రావడంతో 128.2 లక్షల వ్యూస్ రావడమే కాకుండా భారీగా సబ్‌స్ర్కైబర్స్ పెరిగారు. తెలంగాణ సంస్కృతిని నేటి తరానికి అందించడానికి కృషి చేస్తున్న టీ-సాట్ బోనాలు, బతుకమ్మ పండుగలపై ఆకర్షణీయమైన వీడియోలను రూపొందించి అన్ని వర్గాల వారికి చేరువవుతోంది.
అంతేకాక, టీ-సాట్ నెట్‌వర్క్ ఛానెల్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను ఈ-లైబ్రరీలో అందుబాటు లో ఉంచడంతో కావాల్సినప్పుడు సమాచారాన్ని పొందే అవకాశం ఏర్పడింది. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో టీ-సాట్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఐటీ, కమ్యునికేషన్ల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మార్గదర్శకత్వంలో దూసుకుపోతూ యువతకు దిక్సూచిలా మారిన టీ-సాట్ విద్యా ప్రసార ఛానళ్లలో 4.8 మిలియన్ యూజ ర్లతో రికార్డు సృష్టించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఇంటింటికీ చేరువై ఆదరణ పొందుతున్న టీ-సాట్ రాష్ట్రంలో అన్ని రంగాల వారికి వరంలా మారిందనడంలో అతిశయోక్తి లేదు.
ఐ.వి.మురళీకృష్ణ శర్మ