20-09-2025 12:08:41 AM
టెట్‌లో ఉపాధ్యాయులు అర్హత సాధించడం కొంత కష్టం. ఎందుకంటే ఉపాధ్యాయులు పదోన్నతి పొందే సబ్జెక్టులో తప్పనిసరిగా డిగ్రీ లేదా తత్సంబంధ అర్హత సాధించి ఉంటారు. కొందరైతే పీజీ అర్హత సాధించి ఉంటారు. టెట్‌లో ఆ సబ్జెక్టులో ఎంత కఠినమైన ప్రశ్నలు అడిగిన సమాధానాలు రాయగలరు. కాబట్టి సులభంగానే టెట్ పాస్ అయ్యే అవకాశముంటుంది. కానీ పేపర్ అభ్యర్థులు రాస్తున్న టెట్ లో అడుగుతున్న ప్రశ్నలు విచిత్రంగా ఉంటున్నాయి.
సాంఘిక శాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌లో తెలుగు పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. జీవశాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్న ఉపాధ్యాయులు టెట్‌లో గణిత సంబంధ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. గణిత శాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్న ఉపాధ్యాయుడు టెట్‌లో జీవశాస్త్ర సంబంధ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
20 నుంచి 25 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు ఇప్పుడు తమ సబ్జెక్ట్ కాకుండా వేరొక సబ్జెక్టును ఎలా ప్రిపేర్ కాగలరు. టెట్ అర్హత లేకుండా సర్వీస్‌లో కొనసాగించని పక్షంలో ఇన్ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి. సాధారణ టెట్ పరీక్షలా కాకుండా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు వారు బోధించే సబ్జెక్టునీ, బోధన అనుభవాన్ని, బోధన మెలకువలను పరీక్షించే విధంగా ప్రత్యేక టెట్‌ను నిర్వహించాలి.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం లాగా సెప్టెంబర్ 30లోపు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనలు మార్చాలి. దేశ వ్యాప్తంగా 25 లక్షల మంది ఉపాధ్యాయులు, తెలంగాణలో 70 వేల మంది ఉపాధ్యాయుల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరముంది.
నారాయణ్ యాదవ్, నిజామాబాద్