calender_icon.png 8 September, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక విధానాలతో బోధన చేయాలి

08-09-2025 12:09:01 AM

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 7(విజయక్రాంతి): మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన సాంకేతిక విధానాలను అనుసరిస్తూ విద్యాబోధన చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో జిల్లాలోని 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి,కలెక్టర్ సత్యప్రసాద్ చేతులమీదుగా అవార్డులు అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రోజు రోజుకూ, మారుతున్న కాలానికనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక, నైపుణ్యతతో విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేస్తారని వివరించారు.

రాష్ట్రంలో జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికినిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 11వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని, బదిలీలకు అవకాశం కల్పించిందని వివరించారు

ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వర్గాల విద్యార్థులకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని వెల్లడించారు.

అలాగే ఏ టి సి సెంటర్లు మంజూరు చేసిందని దీంతో విద్యార్థులు యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యత అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన ధర్మపురి ప్రాంతానికి చెందిన గొల్లపల్లి గణేష్ ను సన్మానించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ గురువును గౌరవించుకోవడం అంటే జ్ఞానాన్ని గౌరవించుకోవడం అని తెలిపారు.తండ్రి ఆస్తులు అందిస్తే గురువు జ్ఞానన్ని అందిస్తారని,జ్ఞానం నీ సంపద అయితే విజయం నీ బానిస అవుతుందని అన్నారు.కలెక్టర్ సత్య ప్రసాద్ అదనపు కలెక్టర్ బి.లత జిల్లా విద్యాధికారి కే. రాముపాల్గొన్నారు.