14-08-2025 06:34:29 PM
కోనరావుపేట (విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని గిరిజన తండాల్లో తీజ్ పండుగ(Teej festival) వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా లైవ్ రాష్ట్ర ఇంచార్జ్ నరేష్ నాయక్(State Incharge Naresh Nayak) మాట్లాడుతూ, ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో పూజించబడతారో ఆ సమాజం అభివృద్ధి చెంది, వర్ధిల్లుతుంది అని పురాణాలు, పెద్దలు చెప్పినట్లుగా నేటికీ స్త్రీలు ఎంతో గౌరవింపబడి, పూజింపబడుతున్న గిరిజన తెగ లంబాడి గిరిజన తెగ. రాష్ట్రంలో ఉన్న గిరిజన తెగలలో అత్యంత అభివృద్ధి చెందుతూ, స్త్రీ పురుష నిష్కృతి దాదాపు సమానంగా ఉన్నటువంటి తెగ లంబాడి గిరిజనుల తెగ అని అన్నారు.
తీజ్ పండుగను లంబాడి జాతి గిరిజనులు శ్రావణ మాసంలో జరుపుకుంటారు. తీజ్ పండుగను గిరిజన దేవత మేరమ్మయడి, దేవుడు సేవాబయాల (సేవలాల్ మహారాజ్) గుర్తుగా, పెళ్లి కానీ ఆడపిల్లలు భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ పండుగ చేయడం వలన వర్షాలు సకాలంలో కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని తండాలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని పెండ్లి కానీ ఆడపిల్లలకు మంచి మొగుళ్ళు రావాలని, సోదర సోదరీల ఆప్యాయతల గుర్తుగా ఈ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటారని అన్నారు.