14-08-2025 12:00:00 AM
తెలంగాణ గ్రామీణ మూలాల్ని ప్రతిబింబించేలా ముస్తాబై వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకుంది ‘మోతెవరి లవ్‌స్టోరీ’. అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించగా మురళీధర్, సదన్న, విజయలక్ష్మి, సుజాత, మాన్సీ కీలక పాత్రల్లో కనిపించారు. శివకృష్ణ బుర్రా రచనాదర్శకత్వంలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, మై విలేజ్ షో బ్యానర్లపై మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మించారు. ఓటీటీ ఫ్లాట్‌ఫాం ‘జీ5 తెలుగు’లో ఆగస్టు 8న ప్రీమియర్‌కు వచ్చిన ఈ వెబ్‌సిరీస్ ప్రస్తుతం విశేష ఆదరణను చూరగొంటోంది. ఈ క్రమంలో టీమ్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో కథానాయకుడు అనిల్ గీలా మాట్లాడుతూ.. “మోతెవరి లవ్‌స్టోరీ’ని చూస్తే మన ఇంట్లో జరిగే కథలానే అనిపిస్తుంది. దీనికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. మా కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది. స్టాలిన్ చిత్రంలో చెప్పినట్టు మా సిరీస్ గురించి ఓ ముగ్గురికి చెబుతూ వెళ్లండి” అన్నారు. “మోతెవరి లవ్‌స్టోరీ’లో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు, జీ5 టీమ్‌కు థాంక్స్.
అనిల్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది” అని కథానాయకి వర్షిణి అన్నారు. దర్శకుడు శివకృష్ణ మాట్లాడుతూ.. “మోతెవరి లవ్‌స్టోరీ’ మా నాన్నకు అంకితం చేస్తున్నా. మావి గల్ఫ్ బతుకులు.. గల్ఫ్ మెతుకులు. ఇందులోని ఫ్లాష్‌బ్యాక్‌లో క్యాసెట్ సీన్‌ను నా జీవితంలో చూశాను. నాకంటే మా నాన్నకే సినిమాలంటే ఎక్కువ ఇష్టం. అనిల్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాడు. త్వరలో పెద్ద హీరో అవుతాడు.
వర్షిణి, మాన్సీ అందరూ అద్భుతంగా నటించారు. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు నేనెప్పుడూ దాసోహం” అన్నారు. నిర్మాత శ్రీకాంత్ మాట్లాడుతూ.. “ఇది మన తెలంగాణ కథే అయినా, అందరూ చూసేలా తెరకెక్కించాం. ఇక ముందు మా నుంచి ప్రపంచ స్థాయి కంటెంట్ వస్తుంది” అన్నారు. జీ5 తెలుగు వైస్ ప్రెసిడెంట్, కంటెంట్ హెడ్ దేశ్‌రాజ్ సాయితేజ్ మాట్లాడుతూ.. “అనిల్ యూట్యూబ్ నుంచి ఓటీటీ వచ్చాడు..
ఇక ఓటీటీ నుంచి సిల్వర్ స్క్రీన్‌కు వెళ్లాలి. తెలంగాణ నుంచి ఇంకా అనేక మంది కళాకారులు బయటకు రావాలి. గంగాధర్ లిరిక్స్, శ్రీకాంత్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ శివ చాలా కష్టపడ్డారు. అనిల్, వర్షిణి.. అందరూ అద్భుతంగా నటించారు” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు మాన్సీ, మల్లారెడ్డి, సదన్న, గీత రచయిత గంగాధర్, కెమెరామెన్ శ్రీకాంత్ అరుపుల, కొరియోగ్రాఫర్ ప్రశాంత్, మిగతా సిరీస్ బృందం పాల్గొన్నారు.