07-11-2025 07:01:01 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ మిల్లు నాలుగు దశాబ్దాల క్రితం మూతపడడంతో సుమారు నాలుగు వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ మిల్లు స్థలాన్ని అఫిషియల్ లిక్విడేటర్ ద్వారా వేలం వేయనున్నట్లు బ్యానర్లు కాగజ్ నగర్ పట్టణంలో కట్టగా, పత్రికలలో కూడా ఈ వార్త విస్తృతంగా ప్రచారం పొందిందని సీపీఐ(ఎం) నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కు వినతి పత్రం అందజేశారు. మిల్లు స్థలాన్ని ప్రభుత్వం అధికారికంగా కొనుగోలు చేసి, అక్కడ ఒక కొత్త పరిశ్రమను స్థాపించాలనీ, తద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనీ కోరారు.
ఈ స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం పిల్లల ఆట స్థలం, గ్రౌండ్ లేదా ఇతర ప్రజాప్రయోజన కార్యక్రమాల కోసం కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు.మిల్లు స్థలాన్ని వేలం వేసి ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తే, అది వాణిజ్య ప్రయోజనాలకే పరిమితం అవుతుంది. కానీ ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేస్తే కాగజ్ నగర్ పారిశ్రామికంగా మళ్లీ పునరుజ్జీవం పొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గం దినకర్, టికానంద్ తదితరులు పాల్గొన్నారు.