07-11-2025 08:40:36 PM
జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): జిల్లాలోని ఆసిఫాబాద్ డివిజన్ లోని సిబ్బందికి అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ లోని రైతు వేదికలో మహిళా శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ డివిజన్ లోని ఐసిడిఎస్, వైద్య సిబ్బందికి ఏర్పాటు చేసిన ఎస్ఎస్ఎఫ్పి రీ-ఓరియంటేషన్ శిక్షణ తరగతులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, యూనిసెఫ్ హైదరాబాద్ బృందం జిల్లా కన్సల్టెంట్ బాలాజీ లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ... శిశు, మాతృ పోషణ, ఐవైసిఎఫ్ మార్గదర్శకాలు, పోషకాహార లోప నివారణ చర్యలు, పిల్లల పోషకాభివృద్ధి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. తల్లిపాల ప్రాముఖ్యత, వయసుకు అనుగుణమైన ఆహారం, సూక్ష్మ పోషకాలు, పిల్లల వృద్ధి పర్యవేక్షణపై నిపుణుల ద్వారా వివరించడం జరిగిందని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ లక్ష్యాలను సాధించాలని, మాత శిశు సంక్షేమం దిశగా సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక సహాయకులు ప్రవీణ్, నరేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.