calender_icon.png 17 September, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరోగమిస్తున్న తెలంగాణ

16-12-2024 01:55:45 AM

ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం

హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): అవినీతి పాలన, సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎక్స్ వేదికగా ఆదివారం ఆయన స్పందిస్తూ.. రాష్ర్ట ఆర్థిక అభివృద్ధికి రవాణా శాఖ ఒక ఆదాయ వనరు అని.. అలాంటి రంగం కుదేలైందన్నారు.

ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైక్‌లు, కార్లతో పాటు ఇతర భారీ వాహ నాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధిని చూపిస్తాయన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమించిందని, కాంగ్రెస్ పాలనలో రిజిస్ట్రేషన్లు తగ్గి, ఆదాయం తిరోగమనంలో ఉందని విమర్శించారు.

పక్కనున్న ఐదు రాష్ట్రాలు ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయంలో 8 నుంచి 32శాతం వృద్ధిని నమోదు చేశాయని, తెలంగాణలోనే గతేడాది కంటే తక్కువ వృద్ధి నమోదు కావడంతో ప్రభుత్వ పనితీరు బయటపడిందన్నారు. రేవంత్‌రెడ్డి పాలనను గాలికొదిలేసి కక్షసాధింపు చర్యలకే పూర్తి సమయం కేటాయిస్తే ఫలితాలు శూన్యమని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కొనుగోలు వ్యవహారంలో జైలుకు వెళ్లొచ్చిన రేవంత్‌రెడ్డి.. తనలాగే రాజకీయ నేతలు జైలుకు వెళ్లాలని భావిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇటీవల ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఓ ప్రభుత్వ స్కీమ్ ద్వారా తమ సంస్థపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసిన ఎల్‌అండ్‌టీ కంపెనీకి చెందిన సీఎక్స్‌ఓను బహిరంగంగా బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిమాలిన ప్రకటనలతో పారిశ్రామిక వర్గాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు.