calender_icon.png 17 September, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాకీర్ హుస్సేన్ కన్నుమూత

16-12-2024 01:23:11 AM

తబలా మూగబోయింది

అనారోగ్యంతో శాన్‌ఫ్రాన్సిస్కోలో తుదిశ్వాస

ఆయన ఒక సంచలనం.. సంగీత ప్రపంచంలో ఆయన ఒరవడి వేరు. మన  సంప్రదాయ తబలాను ఆయన అంతర్జాతీయ వేదికలపై నిలిపాడు. తబలాపై ఝంజా మారుతంలా కదిలే ఆయన వేళ్లు పాశ్చాత్య సంగీతకారులను అబ్బురపరిచాయి. ఆయన జుగల్ బందీలు హైలెట్. తండ్రి అల్లా రఖా బాటలో తబలా వాయిద్యంతో భారత్ ఖ్యాతిని ప్రపంచం ఎల్లెడలా చాటిన మహా కళాకారుడు జాకీర్ హుస్సేన్.. ఆయన కన్నుమూశారు.. తబలా చిన్నబోయింది.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: తబలా విధ్వంసుడు జాకీర్ హుస్సేన్(73) ఇకలేరు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారు. ఆదివారం ఉదయమే ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆత్మీయులు, అభిమానుల ప్రార్థనలు ఆయ న్ను కాపాడలేకపోయాయి. ప్రసిద్ధ తబలా వాద్యకారుడైన ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ తనయుడే జాకీర్ హుస్సేన్.

జాకీర్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. జాకీర్ పూర్తి పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి. మహిమ్‌లోని సెయింట్ మిచెల్స్ హై స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన జాకీర్.. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జాకీర్ చిన్నప్పటి నుంచే తబలా వాయించడం అంటే ఇష్టం.

ఈ క్రమంలోనే ఏడేళ్ల ప్రాయంలోనే తబలాతో ఆయన తన ప్రయాణం ప్రారంభించారు. తండ్రి దగ్గరే తబలా వాయించడం నేర్చుకుని 12ఏళ్లు వచ్చే సరికి  ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారు. ఆయన తొలి అల్బమ్ ‘లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్’ 1973లో విడుదలైంది. తవా, థాలీ వంటి వంటగది పాత్రలతో కూడా జాకీర్ అద్భుతంగా లయలను సృష్టించేవారు.

‘వ్వాహ్ తాజ్’ అంటూ ఒక అడ్వర్‌టైజ్‌మెంట్‌లో ఆయన అన్న మాటలు దేశ ప్రజలందరికీ సుపరిచితమే. జాకీర్ 1991లో ప్లానెట్ డ్రమ్ కోసం మిక్కీ హార్ట్‌తో కలిసి పని చేశారు. ఆయన ఆల్బమ్‌కు గ్రామీ అవార్డు దక్కింది. అంతేకాకుండా అట్లాంటాలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు సంగీతం అందించిన బృందంలో జాకీర్ సభ్యుడిగా ఉన్నారు.

ఆల్ స్టార్ గ్లోబల్ కాన్సర్ట్‌లో పాల్గొనేందుకు జాకీర్‌ను 2016లోఅమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. శ్వేతసౌధానికి ఆహ్వానం అందుకున్న తొలి భారతీయు సంగీతకారుడు జాకీర్ కావడం విశేషం. కేవలం తబలా వాయించడం మాత్రమే కాకుండా జాకీర్ పలు సినిమాల్లో కూడా నటించారు.

1983లో బ్రిటీష్ చిత్రం హీట్ అండ్ డస్ట్‌లో.. 1998లో సాజ్ సినిమాలో ఆయన ప్రేక్షకులను అలరించారు. 1960లో మొఘల్ చిత్రంలో జాకీర్‌కు నటించే అవకాశం వచ్చింది. కానీ తన తండ్రి వద్దని చెప్పడంతో జాకీర్ ఆ సినిమాలో నటించలేకపోయారు. 

ఒకే ఏడాదిలో మూడు ‘గ్రామీ’లు

తన సంగీత ప్రయాణంలో జాకీర్ ఎన్నో  జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. జాకీర్ హుస్సేన్‌కు ఒకే ఏడాది మూడు గ్రామీ అవార్డులు వచ్చాయి. సంగీత ప్రపంచంలో అత్యున్నతమైన పురస్కారంగా భావించే సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు కూడా 1990లో జాకీర్‌ను వరించింది. 1998లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

అలాగే 2002లో పద్మ భూషణ్, 2023లో దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి. జాకీర్ హుస్సేన్ మృతికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తదితరులు సంతాపం ప్రకటించారు.