08-07-2025 12:00:00 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్
జగిత్యాల, జూలై 7 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ జాగీర్ కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ దుయ్యబట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్‌కు వత్తాసు పలుకుతున్నదని విమర్శించారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలంలో సోమవారం జరిగిన కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు.
బీఆర్‌ఎస్ మీడియాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, అంతు చూస్తామంటూ నిప్పులు చెరిగారు. ఏబీఎన్‌పై బీఆర్‌ఎస్ దాడిచేస్తే తాము టీన్యూస్‌పై క్షణాల్లో దాడులు చేస్తామని హెచ్చరించారు. ఎన్నో స్కాములు చేసిన బీఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వత్తాసు పలుకుతున్నదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో అకారణంగా జైల్లో వేసిన సంగతి సీఎం రేవంత్‌రెడ్డి మర్చిపోయారా అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ పార్టీతో కుమ్కక్కైపోయారా, లేదంటే కాళేశ్వరం సహా అన్ని స్కాంలు చేసిన ఆ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. అక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు చెరువులు, కుంటల్లో భవంతులు నిర్మించి కాలేజీలు, వ్యాపారాలు చేసుకుంటున్న అక్బరుద్దీన్ ఒవైసీ కుటుంబానికి మినహాయింపు ఇచ్చారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
అక్బరుద్దీన్ కాలేజీలో 10 వేల మంది చదువుకుంటున్నందున అక్రమ నిర్మాణాలైనా వాటిని కూల్చలేమని చెపుతున్న హైడ్రా అధికారులు, ఏ జీవనాధారం, గూడు లేక మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న ఇండ్లను ఎందుకు కూల్చేశారని నిలదీశారు.