calender_icon.png 8 July, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత

08-07-2025 12:00:00 AM

  1. ఇచ్చిన ఏ హామీని ఆ పార్టీ నెరవేర్చలేదు
  2. రూ.50 వేల కోట్లకు రూ.12 వేల కోట్లే రుణమాఫీ!
  3. ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి ఏమైంది?
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్న
  5. కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): ఏడాదన్నర పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇచ్చిన ఏ హామీని హస్తం పార్టీ నెరవేర్చలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు. మెదక్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, కార్యకర్తలు సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందని పేర్కొన్నారు. రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పి, అధికారంలోకి రాగానే రేవంత్‌రెడ్డి ప్లేటు ఫిరాయించారని కేటీఆర్ విమర్శిం చారు. రూ.50 వేల కోట్ల రుణమాఫీని రూ.12 వేలకోట్లకు పరిమితం చేశారని, కానీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసినట్టు గొప్పలు చెప్పుకుం టున్నారని ధ్వజమెత్తారు.

అధికారంలోకి వస్తే రెండు పంటలకు ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా ఇస్తానని చెప్పి అన్నదాతలను సీఎం నిలువునా మోసం చేశారని వాపోయారు. మాటతప్పిన సీఎం, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. ఇప్పుడు 100 సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీకి వెళ్తే దొంగల్లాగా చూస్తున్నారని, చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్లాగా చూస్తున్నారని ఏ సీఎం అయినా చెప్పుకుంటారా అని ప్రశ్నించారు.

కేసీఆర్, బీఆర్‌ఎస్ లేకపోతే, గులాబీ జెండా ఎగరకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లు రేవంత్‌లా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రతిపక్షాల మీద అడ్డమైన కేసులు బనాయించలేదని స్పష్టం చేశారు. కేసులు పెట్టుడే ఇందరిమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు.

భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా సీఎంను పొగడటమే పనిగా పెట్టుకోవాలా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తే సీఎంని కచ్చితంగా ప్రజలే పొగుడుతారన్నారు. తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు స్వభావం ఉందని, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు తాను, హరీశ్‌రావు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

నీళ్లు ఆంధ్రాకు.. నిధులు ఢిల్లీకి: హరీశ్‌రావు

నీళ్లు ఆంధ్రాకు.. నిధులు ఢిల్లీకి అన్నట్టు రేవం త్ పాలన తాయరైందని, అందుకోసమే ఇవాళ సీఎం ఢిల్లీకి వెళ్లారని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. అంతకుమించి రేవంత్‌రెడ్డి చేసిందేమీలేదని ఆయన మండిపడ్డారు. మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..

నిజం నిలకడ మీద తెలుస్తుందన్నట్టు కాంగ్రెస్ పాలన ప్రజలకు ఇప్పటికే అర్థమైందని, ఉద్యోగస్తుల జీతాల నుంచి తల్లిదండ్రుల సంక్షేమం కోసం 10 శాతం ఇవ్వాలని సీఎం మాట్లాడినట్టు మీడియా లో వచ్చిందని, 420 హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వయోవృద్ధులు సంక్షేమం కోసం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

కాళేశ్వరం నీళ్లు మెదక్‌కు కూడా వస్తాయని, మోటార్లు ఆన్ చేయాలని అడిగితే పిచ్చిగా మాట్లాడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని.. శ్రీశైలంలో వరదవచ్చి 36 రోజులు కాగా, మోటార్లు ఆన్ చేయలేదన్న తము చెబుతున్నది సరికాదా అని ఎలా అంటారని హరీశ్‌రావు ప్రశ్నించారు. 65 టీఎంసీల నీళ్లను వినియోగించకుండా ఏపీకి నీళ్లు వదిలారని, పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి కృష్ణా నీళ్లు తీసుకెళ్తుంటే మీరు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకుండా మోసం చేయడం అబద్ధమా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఇవ్వక అబద్ధాలు చెబుతున్నామంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. లక్ష క్యూసెక్కులు గోదావరిలో పోతున్నది నిజం కాదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్ ఇబ్బందులు ఎదుర్కొందని, బీఆర్‌ఎస్ హయాంలో వేసిన శిలాఫలకాలను తొలగించి కొత్త శిలాఫలకాలు వేసి అభివృద్ధి అంటున్నారని ఆయన ఆరోపించారు.