calender_icon.png 8 July, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొరికిన ముక్కలే మృతదేహాలు!

08-07-2025 02:06:35 AM

- సిగాచిలో అవశేషాల కోసం అన్వేషణ

- ఇంకా లభించని ఎనిమిది మంది జాడ

- సిగాచి ఎఫెక్ట్‌తో స్వస్థలాలకు కార్మికులు

సంగారెడ్డి, జూలై 7 (విజయక్రాంతి)/పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండ లం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి సోమవారం నాటికి ఎనిమిది రోజులు గడుస్తున్నా పూర్తి స్థాయిలో కార్మికుల అవశేషాలు లభించలేదు. ఇంకా ఎనిమి ది మంది కార్మికుల ఆచూకీ ప్రశ్నార్థకంగానే ఉంది.

అధికారికంగా ఇప్పటి వరకు 42 మం ది మృతి చెందారు. ప్రమాద స్థలిలో రెస్క్యూ టీంకు లభిస్తున్న ఎముకలు, మాడిన మాంస పు ముద్దలను అట్ట బాక్సుల్లో పెట్టి ప్యాక్ చేసి డీఎన్‌ఏ పరీక్షల కోసం పంపిస్తున్నారు. ఎముకలు, మాడిన మాంసపు ముద్దల డీఎన్‌ఏతో పోల్చి వారి సంబంధీకులకు మాంసపు ముద్ద ల బాక్సులను అందజేస్తున్నారు.

ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉంది. స్టాఫ్‌గా పని చేస్తున్న రాహుల్ కుమార్ శర్మ, జి వెంకటేశ్, సిల్వేరి రవి, వర్కర్లు శివాజీ కుమార్, విజయ్‌కుమార్ నిషద్, అఖిలేశ్ కుమార్ నిషద్, ఇర్ఫాన్ అన్స్వారి, సూర్యనొల్లు జస్టిన్ ఆచూకీ లభించాల్సి ఉంది. 

స్వస్థలాలకు కార్మికులు

సిగాచి ప్రమాదం కార్మికులను, పారిశ్రామికవేత్తలను తీవ్ర భయంలోకి నెట్టింది. ప్రమా దం జరిగిన రోజే సిగాచి పరిశ్రమకు చుట్టు పక్కల ఉన్న పరిశ్రమల్లో పని చేసే బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులు స్వగ్రామాలకు వెళ్లారు. పాశమైలారం పారిశ్రామిక వాడలోని పలు పరిశ్రమలతో పాటు బొల్లారం, గడ్డపోతారం, ఖాజీపల్లి, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లోని పలు పరిశ్రమల్లో  పని చేసే కార్మికులు రాత్రికిరాత్రే వెళ్లిపోయారు. 

పరిహారం కొట్టేయడానికి కుట్రలు

మృతిచెందిన కార్మికుల ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. మనోహర్‌రెడ్డి అనే కార్మికుడు ప్రమాదంలో మృతి చెందాడని పటాన్‌చెరు ఆసుపత్రికి సోమవారం ఓ వ్యక్తి వచ్చాడు. అతని మృతదేహాన్ని అప్పగించాలని అధికారులను కోరాడు. ఇందుకు తెలంగాణకు చెందిన ఓ ఎంపీ సిఫారసు లేఖ ను సైతం తీసుకువచ్చినట్లు తెలిసింది. కంపెనీ ఇచ్చిన జాబితాలో మనోహర్‌రెడ్డి పేరు లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చి వివరాలను అడుగగా సదరు వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నాడు. సీసీ కెమెరాల ద్వారా కేటుగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పరిహారం జాబితాపై కసరత్తు

అధికారులు కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన కార్మికుల జాబితా, ఘటన జరిగిన సమయం లో కార్మికశాఖ అధికారుల నేతృత్వంలో సేకరించిన జాబితా ప్రకారం 143 మంది కార్మికు లున్నట్లు గుర్తించారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 42 మంది మృతి చెందారు. జాబితా లో ఉన్న మరో 8 మంది కార్మికుల అవశేషాల కోసం గాలిస్తున్నారు. జాడలేని కార్మికుల పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చనున్నట్లు అధికారులు చెపుతున్నా ఉన్నతాధికారుల నుంచి మాత్రం స్పష్టత రావడం లేదు.